
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) అంత్యక్రియల కార్యక్రమం కొన్ని రోజుల పాటు జరగనుంది.
ఇందులో భాగంగా ఖమేనీ భౌతికకాయాన్ని ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు తరలించారు. అక్కడి నుంచి ఫిబ్రవరి 28న ఆయన హత్యకు గురైన ప్రదేశానికి చేర్చారు. ‘‘ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఖమేనీ భౌతికకాయాన్ని ఆయన అమరత్వం పొందిన ప్రదేశానికి తరలించారు’’ అని ఇరాన్ మీడియా వెల్లడించింది.
టెహ్రాన్‌లో జులై 4,5 తేదీల్లో జరగనున్న అంతిమయాత్రకు రికార్డు స్థాయిలో రెండుకోట్ల మంది వస్తారని ఐఆర్జీసీ అంచనావేస్తోంది. ఈ అప్రకటిత యాత్రకే భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన మద్దతుదారులు నలుపురంగు దుస్తుల్లో వచ్చి నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా పలువురు తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ఇక తొమ్మిదో తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో ఈ యాత్ర జరగనుంది. ఆ రోజున ఖమేనీ (Ali Khamenei) స్వస్థలం మషాద్‌లో ఖననం చేయనున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హోర్డింగ్‌లు, బ్యానర్లు వెలిశాయి.
ఈ అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇరాన్ నుంచి భారత ప్రధాని మోదీకి ఆహ్వానం వచ్చింది. మనదేశం తరఫున కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరిటా, బిహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.