
ఇంట్లో ఇద్దరే ఉంటున్నారు! వృద్ధురాలైన తల్లి.. నడివయసులో ఉన్న కుమారుడు! అతడికి పెళ్లయినా భార్య కుటుంబ కలహాలతో వదిలేసి వెళ్లిపోయింది!
పూట గడవని స్థితిలో తల్లీకొడుకుల బలవన్మరణం
వృద్ధురాలైన తల్లికి పక్షవాతం.. సపర్యలు చేస్తూ ఇంట్లోనే కుమారుడు
పనులకు వెళ్లకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు
హవేళిఘణపూర్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ఇంట్లో ఇద్దరే ఉంటున్నారు! వృద్ధురాలైన తల్లి.. నడివయసులో ఉన్న కుమారుడు! అతడికి పెళ్లయినా భార్య కుటుంబ కలహాలతో వదిలేసి వెళ్లిపోయింది! ఓ చిన్న ఇంట్లో అద్దెకు ఉంటున్న ఆ తల్లీకొడుకులు కొన్నాళ్లుగా తీవ్ర ఆర్థిక సమస్యలతో బాదపడుతూ ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లా హవేళిఘణపూర్ మండలం ముత్తాయికోట గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతులు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటపల్లికి చెందిన నగరం భారతి అలియాస్ భారతమ్మ (62), ఆమె కుమారుడు శ్రీకాంత్ (42). భారతమ్మ భర్త గతంలోనే మృతిచెందాడు. ఆమెకు ఇద్దరు కూతుళ్లున్నారు. పెళ్లిళ్లు కావడంతో అత్తగారింట్లో ఉంటున్నారు. తల్లీకొడుకులు కొన్నాళ్లు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో, ఇంకొన్నాళ్లు మెదక్‌లో ఉన్నారు. మెదక్‌లో ఇంటి అద్దె, పోషణ ఖర్చు ఎక్కువగా అవుతున్నాయని చెప్పి నిరుడు మెదక్‌కు సమీపంలోనే ఉన్న ముత్తాయికోట గ్రామానికొచ్చి ఓ కిరాయి ఇంట్లో ఉంటున్నారు. భారతమ్మకు గత నెలలో పక్షవాతం వచ్చింది. మెదక్ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. ఆమెను ఇంటికి తీసుకొచ్చాక సేవలు చేసుకుంటూ శ్రీకాంత్ పనులకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఇల్లు గడిచే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఆవేదనతో భారతమ్మ గురువారం పురుగుల మందు తాగింది. శ్రీకాంత్ ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. అదేరోజు భారతమ్మ కుమార్తె ఇంటికొచ్చి చూడగా మృతదేహాలు కనిపించాయి. పోలీసులొచ్చి మృతదేహాలను మెదక్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.