
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Tirumala: కలియుగ వైకుంఠవాసుడు కొలువుదీరిన తిరుమల క్షేత్రాన్ని సినీ, రాజకీయ ప్రముఖులు పోటెత్తారు. సాధారణ భక్తులతోపాటు ప్రముఖులు తరలివచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ ప్రముఖులతోపాటు పలువురు సినీ ప్రముఖులు తిరుమల ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారిని దర్శించుకున్నది ఎవరెవరో తెలుసుకుందాం.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యం జరిగే దివ్య దర్శనాల్లో భాగంగా గురువారం పలువురు ప్రముఖులు వేంకటేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. పవిత్రమైన తిరుమల క్షేత్రంలో స్వామివారి దర్శనం అనంతరం వారు ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తిరుమల స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. అనంతరం వీఐపీ దర్శన ఏర్పాట్లలో భాగంగా స్వామివారి సన్నిధికి చేరుకుని వారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా.. తీర్థప్రసాదాలు స్వీకరించారు.
మాజీ గవర్నర్ దర్శనం తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తిరుమల స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన స్వామివారి కృపతో దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
సినీ ప్రముఖులు సినీ రంగానికి చెందిన ప్రముఖులు కూడా తిరుమలలో దర్శనం చేసుకున్నారు. ప్రముఖ నటుడు సాయికుమార్ కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం సాయికుమార్ మాట్లాడుతూ.. 'తిరుమల దర్శనం జీవితంలో అత్యంత పవిత్రమైన అనుభవం' అని తెలిపారు. ప్రముఖ నటుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత రాజేంద్రప్రసాద్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం చేసుకున్న అనంతరం ఆలయ వాతావరణాన్ని ఎంతో ప్రశాంతంగా అనుభూతి చెందినట్లు తెలిపారు. దర్శనం అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. 'ఆయనే పద్మాసనుడు. పద్మ ఇప్పించింది ఆయనే. నా జీవితంలో ఏదీ జరిగినా వారికి చెప్పుకోవటం నాకు అలవాటు. అందుకే స్వామిని దర్శించుకున్నా. నాకు వచ్చిన అవార్డు మీ అందరికీ వచ్చినట్లే' అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
నారా లోకేశ్, పీవీఎన్ మాధవ్ ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కుటుంబసభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా.. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కూడా తిరుమల వారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠంలోని కంపార్ట్మెంట్లు 27 క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 10 నుంచి 15 గంటల సమయం పడుతుండగా.. టైమ్ స్లాట్ (ఎస్ఎస్డీ) టోకెన్లు కలిగిన భక్తులకు 6 నుంచి 8 గంటలు సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 2.3 గంటల సమయం పడుతుండగా.. నిన్న ఒక్కరోజే 78,067 మంది భక్తులు స్వామినిదర్శించుకున్నారు. స్వామివారికి 31,158 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామివారి హుండీకి రూ.4.39 కోట్లు ఆదాయం లభించింది.