
యువగళం బృందంతో శాశ్వత అనుబంధం తిరుపతి: తన వెంట నడిచిన వారిని మర్చిపోని మంత్రి నారా లోకేష్ పాదయాత్ర బంధం శాశ్వతమని చాటిచెప్పారు. ఏ వేదికైనా, ఏ వేడుకైనా అక్కడ యువగళం పాదయాత్రలో పాల్గొన్నవారు
కనిపిస్తే పేరు పెట్టి పలకరించి, ఆగి మాట్లాడి వెళ్లే నారా లోకేష్ యువగళం బంధం.. తరగని అనుబంధం అని మరోసారి నిరూపించారు. కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి వివాహం సందర్భంగా.. కాబోయే దంపతులను ఆశీర్వదించేందుకు తిరుపతిలో వధువు ఇంటికి వెళ్లారు మంత్రి నారా లోకేష్. అక్కడ యువగళం పాదయాత్రలో తనతోపాటు ఎండనక , వాననక నడిచిన టిడిపి సైనికులు కనిపించారు. అక్కడే ఆగి అందరిని పేరుపేరునా పలకరించి వారితోపాటు కూర్చున్నారు. దాదాపు 15 నిమిషాల పాటు మాట్లాడిన లోకేష్ యువగళం పాదయాత్ర నాటి సంగతులు గుర్తుకు తెచ్చుకున్నారు. నాటి వైసిపి ప్రభుత్వం అణచివేతను ఎదిరించి మరీ పాదయాత్రను ముందుకు తీసుకెళ్లడంలో ఒక సైన్యంలా పనిచేశారని ప్రశంసించారు. పాదయాత్రలో ఉద్యోగాల కల్పన అవసరాన్ని గుర్తించి ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీ నెరవేర్చేందుకు తీసుకువచ్చిన పెట్టుబడులు కల్పించిన ఉద్యోగాలను యువగళం దళానికి వివరించారు. జాబ్ క్యాలెండర్, టీచర్ పోస్టుల భర్తీ, కానిస్టేబుళ్లు నియామకాలు చేపట్టామని తెలిపారు. కార్యకర్తే అధినేత నినాదంతో టిడిపి కేడర్ సాధికారత సాధించేందుకు చేస్తున్న కృషిని తెలియజేశారు. సూర్య ప్రకాష్ ఎలా ఉన్నావు అంటూ యోగక్షేమాలు కనుక్కున్నారు. ఏమప్పా! వెంకటప్ప కుశలమేనా అని పలకరించారు. చంద్రా బాగున్నావా? అని ఆరా తీశారు. ఎల్లప్ప, లక్ష్మీపతిలతో పాదయాత్ర జ్ఞాపకాలు పంచుకున్నారు. ఒక ఇంటి వాడు కాబోతున్న నాదెండ్ల బ్రహ్మం చౌదరికి శుభాకాంక్షలు తెలిపారు. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. జస్వంత్, రవి నాయుడులతో మిగిలిన యువ బృందం గురించి అడిగి తెలుసుకున్నారు.