
తిరుపతి: వీబీ జీరామ్‌జీ.. గ్రామాల ముఖచిత్రం మార్చే కార్యక్రమమని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. దీనిపై ప్రధాని మోదీని అభినందించాలన్నారు.
గతంలో ఉపాధి హామీని రాయలసీమ నుంచే ప్రారంభించారని గుర్తుచేశారు. ఇప్పుడు మెరుగైన సవరణలతో వీబీ జీరామ్‌జీని తీసుకొచ్చారని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ముక్కాలవారి పల్లెలో ఈ పథకానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రూ.7,700 కోట్లు, రాష్ట్ర వాటా రూ.4 వేల కోట్లు కలిసి మొత్తం రూ.11వేల కోట్ల పైనే ఈ పథకానికి ఖర్చు పెడుతున్నామన్నారు.
‘‘ఈ పథకం కింద ఏ అభివృద్ధి పని అయినా చేసుకోవచ్చు. భూసార పరిరక్షణ, రహదారులు, డ్రైనేజీలు నిర్మించుకోవచ్చు. కొత్త ఆలోచనలు, విధానాలతో సమాజానికి మేలు చేసేలా కేంద్రం సంకల్పించింది. పనిని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం సంతోషించే విషయం. దొంగ లెక్కలు రాసుకోలేని విధంగా డిజిటల్ విధానం తీసుకొచ్చారు. పారదర్శకత కోసం రియల్‌టైమ్ మానిటరింగ్ ఉంటుంది’’ అని చంద్రబాబు తెలిపారు.
‘‘గాలేరు-నగరి కాల్వ కోడూరుకు తీసుకొచ్చే బాధ్యత మాది. జలధార ద్వారా భూగర్భ జలాలను పెంచుకునేలా సంకల్పించాం. ఎంజీనరేగాలో కేంద్ర, రాష్ట్రాల వాటా 90-10గా ఉండేది. ఇప్పుడు రాష్ట్రం వాటా 40శాతం ఉంది. గడిచిన ప్రభుత్వ హయాంలో నిధులన్నీ దారిమళ్లించారు. ఇప్పుడు ఉపముఖ్యమంత్రి పవన్ నాయకత్వంలో గ్రామాల రూపురేఖలు మారుతాయి. ఒకే సారి గ్రామసభలు ఏర్పాటు చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పిన ఘనత పవన్‌ది. 2024 ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా 13,226 గ్రామాల్లో ఒకేసారి గ్రామసభలు నిర్వహించారు. వేల కి.మీ మేర సీసీ రోడ్లు, 40వేల గోకులాలు, 15,500 నీటి తొట్టెలు నిర్మించారు. కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేసిన ఘనత పవన్ కల్యాణ్‌ది’’ అని సీఎం ప్రశంసించారు.
‘‘రాష్ట్రంలో గొడ్డలి పార్టీ ఉంది. దాంతో జాగ్రత్తగా ఉండాలి. అది రోజుకో మాట మాట్లాడుతోంది. ఎన్నికలకు ముందు అసెంబ్లీ సాక్షిగా అమరావతి అన్నారు. గతంలో మూడుముక్కలాట (మూడు రాజధానులను ఉద్దేశించి) ఆడారు. ఎన్నికలు అయిపోయాక మావిగన్ అంటున్నారు. మన రాజధాని అమరావతే.. అది దేవతల రాజధాని. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేస్తాం. విశాఖకు రైల్వే జోన్ సాధించాం. ఉత్తరాంధ్రకు గూగుల్ డేటా సెంటర్ వస్తోంది. రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం’’ అని చంద్రబాబు అన్నారు.
పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా వీబీ జీరామ్‌జీ పథకం తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ‘‘ వీబీ జీరామ్‌జీ పథకం కింద రూ.7.5లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం. ప్రతి గ్రామానికి ఉపాధి కార్యక్రమాల కోసం రూ.2 కోట్లు అందజేస్తారు. చేసిన పనికి వేతనం ఆలస్యం కాకూడదనే మార్పులు చేశాం. కార్మికుడి కష్టానికి సరైన న్యాయం చేయాలని సంకల్పించాం. నేరుగా బ్యాంకు ఖాతాలోనే డబ్బులు జమవుతాయి. గ్రామాల వికాసానికి ఎన్డీయే ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. ఏ పనులు చేపట్టాలన్నా గ్రామాలకే అధికారం కల్పించాం. ఈ పథకం కింద ఏ పనులు చేయాలన్నా స్థానికంగానే నిర్ణయం తీసుకోవచ్చు’’ అని శివరాజ్ సింగ్ వెల్లడించారు.
ఏపీ గ్రామీణాభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని అన్నారు. ‘‘ పేదరిక నిర్మూలనలో భాగంగా వికసిత్ భారత్ జీరామ్‌జీ తీసుకొచ్చాం. ఉపాధి శ్రామికులకు అదనంగా 25 రోజులు భరోసా కల్పించడం ముఖ్యమైంది. ఏపీలో ఈ కార్యక్రమం అమలు చేసేందుకు మొత్తం రూ.12,845 కోట్లు ఖర్చు చేయనున్నాం. గత రెండేళ్లలో పల్లె పండుగ వంటి కార్యక్రమాల కోసం రూ.16,695 కోట్ల ఉపాధి నిధులు వినియోగించాం. 7వేల కి.మీ సీసీ రోడ్లు, 15,500 పశువుల నీటితొట్టెలు నిర్మించాం. శ్రామికుల కొరత రాకుండా వ్యవసాయ సీజన్లో 60 రోజుల విరామం రైతులకు ఉపయోగపడుతుంది’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
అత్తాకోడలు కలిసుంటేనే గొప్పగా చెప్పుకొనే కాలమిది! నలుగురు పిల్లల్ని ఒకచోట వదిలేస్తే అల్లరిని అదుపుచేయలేం.
కార్యకర్తలు తప్పుడు పనులు చేస్తే తాను సమర్థించబోనని ఏపీ శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.