
హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (RGIA) నకిలీ వీసాల వ్యవహారం కలకలం రేపింది. ఒమాన్ ఎయిర్ విమానంలో మస్కట్ వెళ్లేందుకు వచ్చిన 20 మంది మహిళా ప్రయాణికులను ఇమ్మిగ్రేషన్ అధికారు
లు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న వీసాలను పరిశీలించగా అవి నకిలీవి అని తేలగానే మహిళలను అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రయాణికుల పాస్‌పోర్టులు, వీసాలు పరిశీలిస్తుండగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనంతరం లోతుగా పరిశీలించగా వీసాల్లో అక్రమాలు బయటపడటంతో వెంటనే 20 మంది మహిళలను బోర్డింగ్ వైపు వెళ్లకుండా నిలిపివేశారు. ఆ తర్వాత వారిని ఎయిర్పోర్ట్ ఔట్‌పోస్ట్ పోలీసులకు అప్పగించారు.
ప్రస్తుతం పోలీసులు మహిళలను విడివిడిగా విచారిస్తున్నారు. వారు ఏ జిల్లాలకు చెందినవారు? విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్తున్నారా? ఈ వీసాలను ఎవరు ఏర్పాటు చేశారు? ఎంత మొత్తం వసూలు చేశారు? అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. అంతర్జాతీయ విమానాశ్రమం అధికారుల సమాచారం ప్రకారం.. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో కొందరు ట్రావెల్ ఏజెంట్లు లేదా రిక్రూట్మెంట్ ముఠాలు మహిళలను మోసం చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అసలు వీసాల పేరుతో నకిలీ పత్రాలు అందించి, భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇది కేవలం 20 మంది మహిళల కేసు మాత్రమేనా? లేక దీని వెనుక పెద్ద నకిలీ వీసాల రాకెట్ పనిచేస్తోందా? అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. వీసాలు తయారు చేసిన వ్యక్తులు, వాటిని సరఫరా చేసిన ఏజెంట్లు, ట్రావెల్ సంస్థల పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల పోలీసులతో కలిసి విచారణ చేపట్టే అవకాశముంది. అధికారులు చెప్పుకొచ్చారు
విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే వారు అధికారికంగా గుర్తింపు పొందిన రిక్రూట్మెంట్ ఏజెన్సీల ద్వారానే ప్రక్రియ పూర్తి చేయాలని, వీసాలు, ఉద్యోగ ఒప్పందాలు, ప్రయాణ పత్రాలను ముందుగానే ధ్రువీకరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆకర్షణీయమైన జీతాల పేరుతో మోసాలకు పాల్పడే మధ్యవర్తులను నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..