
అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Ishan Kishan Run Out Video: ఐర్లాండ్‌పై టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా.. ఇంగ్లాండ్‌పై మాత్రం బ్యాటింగ్‌లో అదరగొట్టింది. అభిషేక్ శర్మ (59), శ్రేయాస్ అయ్యర్ (68), శివమ్ దుబే (42 నాటౌట్) మెరుపులు మెరిపించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. భారత్ ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం భారీ వర్షం కురవడంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ సాధ్యపడలేదు. దీంతో మ్యాచ్ రద్దయింది. ఇక టీ20 వరల్డ్ కప్‌లో మెరుపులు మెరిపించిన సంజూ శాంసన్ (1) వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ (0) అనవసరమైన పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు.
రెండో ఓవర్ నాలుగో బంతికి సంజూ శాంసన్ ఔట్ అవ్వగా.. ఇదే ఓవర్లో చివరి బంతిని ఇషాన్ కిషన్ మిడాన్ వైపుగా ఆడాడు. వెంటనే పరుగు కోసం ముందుకు వెళ్లగా.. నాన్ స్టైకర్ ఎండ్ నుంచి అభిషేక్ శర్మ వద్దని చెప్పాడు. అప్పటికే సగం దూరం వచ్చేసిన ఇషాన్ కిషన్ వెనక్కి వెళ్లేలోపు.. హ్యారీ బ్రూక్ బంతిని అందుకుని వికెట్ కీపర్ జోస్ బట్లర్‌కు అందించాడు. బట్లర్ ఎలాంటి పొరపాటు చేయకుండా బెయిల్స్‌ను పడగొట్టేశాడు. ఇషాన్ డైవ్ చేసినా ప్రయోజనం లేకపోయింది. అంపైర్ రిప్లై పరిశీలించే సమయంలో ఇషాన్‌తో అభిషేక్ శర్మ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
"నువ్వెందుకు పరుగెత్తలేదు?" అని అభిషేక్ శర్మను ఇషాన్ కిషన్ అడగ్గా.. "నువ్వు అక్కడికి (క్రీజ్‌లోకి) చేరుకున్నావా?" అని అభిషేక్ అన్నాడు. దీనికి "నాకు తెలియదు.. అది దగ్గరలో ఉండొచ్చు" అని బదులిచ్చాడు. వెంటనే "ఏం చేస్తున్నావ్, ఇషాన్?" అని అడిగాడు. "అతను ముందున్నాడు. అది నా కాల్" అని బదులిచ్చాడు. "కానీ అతను ఎక్కడ నిలబడ్డాడో నువ్వు చూడాలి" అని అభిషేక్ శర్మ అన్నాడు. రిప్లై పరిశీలించిన థర్డ్ అంపైర్.. ఇషాన్ కిషన్‌ను ఔట్‌గా ప్రకటించాడు.
రెండు ఓవర్లలో ఆరు పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లాండ్ జట్టు పట్టుబిగించినట్లే అనిపించింది. అయితే ఇషాన్ కిషన్ రనౌట్ అయ్యాడనే కోపంతో అభిషేక్ శర్మ చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్లను చితక్కొడుతూ.. వరుసగా ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు, సిక్సర్ బాదగా.. ఐదో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు. ఇదే ఊపులో 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తరువాత ఓ సిక్సర్ బాదిన అభిషేక్ శర్మ.. సామ్ కర్రాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్యూ ఔటై రూపంలో పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.