తెలంగాణలోని అద్భుతమైన చారిత్రక, ఆధ్యాత్మిక సంపదను ప్రపంచ దేశాలకు చాటిచెప్పేందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) నడుం బిగించింది.
హైదరాబాద్ మహానగరంతో పాటు నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో విస్తరించి ఉన్న పురాతన బౌద్ధ, జైన సంస్కృతీ వారసత్వ ప్రదేశాలను అనుసంధానం చేస్తూ ఒక భారీ అంతర్జాతీయ పర్యాటక సర్క్యూట్‌కు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. చారిత్రాత్మక కట్టడాలను, పురావస్తు క్షేత్రాలను ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆధునీకరించి విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షించేలా మౌలిక వసతులను పర్యాటక శాఖ మెరుగుపరుస్తోంది.ఈ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ బుద్ధ విగ్రహం ప్రధాన కేంద్రంగా నిలవనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా బుద్ధ విగ్రహాల్లో ఒకటిగా పేరొందిన ఈ ప్రాంతం చుట్టూ పర్యాటకుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక సరికొత్త సర్క్యులర్ స్కైవాక్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా పర్యాటకులు సరికొత్త కోణంలో బుద్ధుడి విగ్రహ సౌందర్యాన్ని వీక్షించే వీలు కలుగుతుంది. అదనంగా నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద 274 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రూపుదిద్దుకున్న ఆసియాలోనే అతిపెద్ద బౌద్ధ హెరిటేజ్ థీమ్ పార్క్ అయిన బుద్ధవనంలో అంతర్జాతీయ బుద్ధ మ్యూజియం, హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి మహాస్తూపం, బుద్ధుని జీవిత విశేషాల శిల్పాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి.ఈ సర్క్యూట్లో శాతవాహనుల కాలం నాటి విశేష ప్రాధాన్యత కలిగిన సూర్యాపేట జిల్లా ఫణిగిరి కొండపై లభించిన బౌద్ధ స్తూపాలు, శిల్పాలు, తోరణాలు అంతర్జాతీయ పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అలాగే, దక్షిణ భారతదేశంలోనే బౌద్ధ సంస్కృతికి కీలక ఆధారంగా నిలిచిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని అతిపెద్ద మట్టి స్తూపం కూడా ఈ ప్యాకేజీలో భాగం కానుంది. వీటితో పాటు ధూళికట్ట, గాజులబండ, కొండాపూర్ వంటి చారిత్రక ప్రాంతాలను కూడా ఒకే గొడుగు కిందికి తెస్తున్నారు. జైన మతానికి సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధ కొలనుపాక జైన దేవాలయం ఈ సర్క్యూట్లో అత్యంత కీలకమైనది. 2 వేల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ పురాతన క్షేత్రంలో 21వ తీర్థంకరుడైన భగవాన్ మహావీరుని 3 అడుగుల అరుదైన పచ్చ విగ్రహం ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన జైన శ్వేతాంబర్ తీర్థ క్షేత్రం కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న జైనులకు ఇది పరమ పవిత్రమైనది.ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు వీకెండ్స్‌లో వినోదాన్ని, జ్ఞానాన్ని కోరుకునే పర్యాటకుల కోసం ఒకటి, రెండు రోజుల ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలను టీజీటీడీసీ డిజైన్ చేస్తోంది. జపాన్, శ్రీలంక, థాయిలాండ్, వియత్నాం, దక్షిణ కొరియా వంటి ఆగ్నేయాసియా దేశాల నుంచి ప్రతి ఏటా లక్షలాది మంది బౌద్ధ పర్యాటకులు భారతదేశానికి వస్తుంటారు. ఇప్పుడు తెలంగాణలోని ఈ బౌద్ధ, జైన సర్క్యూట్ అందుబాటులోకి వస్తే ఆయా దేశాల పర్యాటకులు నేరుగా హైదరాబాద్‌కు వచ్చేందుకు ఎంతో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. తద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి కొత్త ఉత్సాహం రావటంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పర్యాటక శాఖ ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.