
పిల్ దాఖలు.. ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం లీజు పద్ధతిలోనే ఇస్తున్నామన్న ఏజీ ఈనాడు, అమరావతి: సింహాచలం దేవస్థానానికి చెంది
న 160 ఎకరాల భూములను హైపర్ స్కేల్ డేటాసెంటర్ పార్క్ లిమిటెడ్‌కు బదలాయిస్తున్నారంటూ పర్యావరణవేత్త, జల్ బిరాదరి జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ దాఖలుచేసిన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలంటూ పురపాలక, రెవెన్యూ, పర్యావరణ, దేవాదాయ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఐటీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ కార్యదర్శి, పీసీబీ, ఏపీఐఐసీ, దేవాదాయ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్, విశాఖ కలెక్టర్, హైపర్ స్కేల్ డేటాసెంటర్ పార్క్ లిమిటెడ్ సంస్థలకు నోటీసులు జారీచేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.
రాష్ట్రప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. భూములు బదలాయిస్తున్నామని పిటిషనర్ అపోహ పడుతున్నారన్నారు. లీజు పద్ధతిలోనే డేటాసెంటర్ పార్క్‌కు భూమి కేటాయిస్తున్నామన్నారు. పర్యావరణ అనుమతులు, భూకేటాయింపు రెండు అంశాలను ఒకే వ్యాజ్యంలో సవాలు చేయడానికి వీల్లేదన్నారు. పర్యావరణ చట్టాలకు విరుద్ధంగా అనుమతులు మంజూరుచేశారని భావిస్తే.. ఈ వ్యవహారాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ)లో సవాలు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.