
రంగారెడ్డిలో 32%, మేడ్చల్లో 37%, హైదరాబాద్లో 42% ఓటర్లకే అందిన ఫారాలు రాష్ట్రంలోని 33% ఓటర్లు ఈ మూడు జిల్లాల పరిధిలోనే..
Jul 2 2026 6:09 AM | Updated on Jul 2 2026 6:09 AM
రంగారెడ్డిలో 32%, మేడ్చల్లో 37%, హైదరాబాద్లో 42% ఓటర్లకే అందిన ఫారాలు
రాష్ట్రంలోని 33% ఓటర్లు ఈ మూడు జిల్లాల పరిధిలోనే..
మరో రెండు రోజుల్లో మొదలుకానున్న ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్)–2026లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాల్లో నత్తనడకన సాగుతోంది. రాష్ట్రంలో 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా బుధవారం రాత్రి నాటికి 2.38 కోట్ల మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగింది. ఇందులో అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో 32 శాతం, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో 37 శాతం, హైదరాబాద్ జిల్లాలో 42 శాతం మంది ఓటర్లకే ఎన్యూమరేషన్ ఫారాలు అందాయి. సర్–2026 షెడ్యూల్ ప్రకారం గత నెల 24న ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని ప్రారంభించగా వారం రోజుల్లోగా పూర్తి చేయాలని పెట్టుకున్న లక్ష్యం నెరవేరలేదు. మరో 2, 3 రోజుల్లో గ్రామీణ జిల్లాల్లో ఫారాల పంపిణీ పూర్తికావచ్చని అధికారులు అంచనా వేస్తుండగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాల విషయంలో మాత్రం ఏమీ చెప్పలేకపోతున్నారు. ఈ మూడు జిల్లాల్లో గరిష్టంగా 70 శాతానికి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగే అవకాశం లేదని అంచనా వేశారు. రాష్ట్రంలోని 33.75 శాతం ఓటర్లు ఈ మూడు జిల్లాల్లోనే ఉండగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో తీవ్రంగా వెనుకబడటం ఆందోళన కలిగిస్తోంది. ఓటర్ల మ్యాపింగ్లో సైతం ఈ మూడు జిల్లాలు అట్టడుగు స్థానంలో ఉన్నాయి. ఫారాలను నింపి ఈ నెల 24లోగా స్థానిక బీఎల్ఓలకు అందించే ఓటర్ల పేర్లనే ఈ నెల 31న ముసాయిదా ఓటర్ల జాబితాలో ప్రచురించనున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ మూడు జిల్లాల్లోనే లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతు కావొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిలకడ లేని ఓటర్లు... వలసల్లో భాగంగా తరచూ అద్దె ఇళ్లు మారడం, ఉద్యోగాల మార్పు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగుల వలసలు, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు కలిగి ఉండటం, ఇళ్లకు తాళాలు వేసి ఉండటం వంటి కారణాలతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాల్లో ఓటర్ల ఆచూకీని బీఎల్ఓలు కనిపెట్టలేకపోతున్నారని అధికారులు తెలిపారు. ఒకవేళ బీఎల్ఓలు మూడుసార్లు ఇంటికి వెళ్లినా తాళం వేసి ఉంటే ఆ ఇంట్లోని ఓటర్ల ఫారాలను తలుపు వద్దే పెట్టి రావాలని బీఎల్ఓలకు జీహెచ్ఎంసీ సూచించడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. రెండు రోజుల్లో డిజిటలైజేషన్ మరో రెండు రోజుల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియను ముగించి ఆ వెంటనే డిజిటలైజేషన్ ప్రక్రియను ఈసీ ప్రారంభించనుంది. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) మళ్లీ ఓటర్ల ఇళ్లకు వెళ్లి వారు నింపిన ఫారాలను వెనక్కి తీసుకుని తమ మొబైల్ ఫోన్లోని ఈసీ యాప్ ద్వారా స్కాన్ చేసి అప్లోడ్ చేయనున్నారు. స్కాన్ చేసిన ఫారాల్లోని సమాచారాన్ని ఎప్పటికప్పుడు డేటా ఎంట్రీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఫారాలను ఎలా నింపాలో ఓటర్లకు బీఎల్ఓలు అవగాహన కల్పిస్తారని అధికారులు పదేపదే పేర్కొంటుండగా బీఎల్ఓలలో అధిక శాతం మందికి ఫారాలను ఎలా నింపాలో తెలియడం లేదు. దీంతో వారికి మరోసారి శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు సీఈఓ కార్యాలయం ఆదేశించింది. భాగ్యనగరంలో ఇళ్లకు రాని బీఎల్ఓలు.. హైదరాబాద్లో ఇంకా చాలా మందికి ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదు. బీఎల్ఓలే ఇళ్లకు వచ్చి ఫారాలు ఇస్తారని ఓటర్లు ఎదురుచూస్తున్నారు. అయితే కొందరు బీఎల్ఓలు మాత్రం తమ వద్దకు వచి్చన ఓటర్లకే ఫారాలు పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అలాగే మరికొందరు బీఎల్ఓలు రాజకీయ పార్టీల కార్యాలయాలు, నేతల ఇళ్ల వద్ద మకాం వేసి ఫారాలు పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్ చేయడం గమనార్హం.
ఏపీ : శిల్ప కళా వైభవం.. చెక్కుచెదరని కట్టడం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)
ప్రేమలో పడిన యంగ్ హీరోయిన్.. ప్రియుడు ఇతడే (ఫొటోలు)
సత్యదేవ్ ‘రావు బహదూర్’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. (ఫోటోలు)
అక్కినేని అఖిల్ ‘లెనిన్’ మూవీ HD స్టిల్స్
ఎవర్ని మోసం చేయడానికి బాబు మళ్లీ భూమి పూజ చేస్తున్నాడు?
బెల్జియాన్ని వణికించిన భారీ అగ్నిప్రమాదం!
కేసులో బిగ్ ట్విస్ట్.. సియా సోదరుడిపై 10 కోట్ల పరువు నష్టం దావా