
అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
VB-G RAM G Wage Rates Increased: ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 'వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్)' - (VB-G RAM G) చట్టం-2025 కింద సవరించిన నూతన వేతనాల రేట్లను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ పెరిగిన జీతాలు నేటి (జూలై 1, 2026) నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. ఇక నుంచి ఏ రాష్ట్రంలోనూ రోజువారీ కనీస కూలి రూ.300 కంటే తక్కువ ఉండకూడదని కేంద్రం స్పష్టం చేసింది. గతంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద సగటున రోజుకు రూ.298.8 ఉన్న వేతనాన్ని. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం రూ.327.4 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంటే రోజువారీ కూలీపై సగటున రూ.28.6 పెరిగింది. దేశవ్యాప్తంగా చూస్తే వేతనాలలో దాదాపు 10 శాతానికి పైగా పెరుగుదల నమోదైంది.
గ్రామీణ కార్మికుల ఆర్థిక సాధికారతకు బాటలు..
ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధి ఫలాలు ప్రతి పేద కుటుంబానికి అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ చట్టం ద్వారా ఉపాధి హామీ రోజులను 125 రోజులకు పెంచడమే కాకుండా, కూలీల వేతనాలను కూడా భారీగా పెంచామని చెప్పారు. ముఖ్యంగా గతంలో తక్కువ కూలీ ఉన్న రాష్ట్రాలకు ఈసారి అత్యధిక ప్రాధాన్యతనిచ్చామని.. దీనివల్ల గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి పెరిగి, గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
==> కనీస వేతనం రూ.300: గతంలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూలి రేట్లు రూ.300 కంటే తక్కువగా ఉండేవి (కొన్ని చోట్ల కనీస కూలి రూ.241 మాత్రమే ఉండేది). ఇప్పుడు ఆయా ప్రాంతాలన్నింటినీ కనీస కూలీ 300 రూపాయలుగా ఉండనుంది.
==> 15 శాతం నుంచి 25 శాతానికి పెంపు: అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో గరిష్టంగా 24.5 శాతం మేర వేతనాలు పెరిగాయి. అలాగే ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూలి 15 శాతం నుంచి 25 శాతం వరకు పెరిగింది.
==> ఈ రాష్ట్రాల్లో రూ.400 పైగా: హర్యానా (రూ.409), గోవా (రూ.406), కేరళ (రూ.401), సిక్కింలోని ఎత్తైన గ్రామ పంచాయతీల్లో (రూ.450) చొప్పున వేతనాలు 400 రూపాయలు దాటాయి. కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా వేతనాలు రూ.360 పైగానే పెరిగాయి.
==> కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నూతన 'VB-G RAM G' చట్టం ద్వారా ఏడాదికి 125 రోజుల ఉపాధి గ్యారెంటీ లభించడంతో పాటు, పెరిగిన కూలి రేట్లు గ్రామీణ భారతదేశంలో సరికొత్త వెలుగులు నింపుతాయని అధికారులు చెబుతున్నారు. 'వికసిత్ భారత్ @2047' స్వప్నాన్ని సాకారం చేసే దిశగా.. గ్రామీణ పేదల సంక్షేమానికి ఈ నిర్ణయం ఒక మైలురాయిగా నిలవనుందని చెబుతున్నారు.
==> తక్కువ వేతన రేట్లు ఉన్న రాష్ట్రాలకే అత్యధిక ప్రయోజనాలు చేకూరేలా సవరించిన వేతన నిర్మాణాన్ని రూపొందించారు. తద్వారా సమానత్వం, సమతుల్య ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నారు.