Why KPIT Tech Stock is Falling Today : స్టాక్ మార్కెట్లలో ఐటీ కంపెనీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేవారికి, చేయాలనుకునే వారికి బ్యాడ్‌న్యూస్. కొంత కాలంగా ఐటీ స్టాక్స్ దారు
ణంగా పతనం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఐటీ సంస్థ, ఇంజినీరింగ్ సేవల సంస్థ కేపీఐటీ టెక్నాలజీస్ షేరు భారీగా పడిపోయింది. బుధవారం సెషన్లో ఇంట్రాడేలో దాదాపు 16 శాతానికిపైగా పడిపోయి ఇన్వెస్టర్లకు భారీ నష్టాల్ని మిగిల్చింది. కంపెనీ విడుదల చేసిన క్యూ1 బిజినెస్ అప్డేట్ ఇన్వెస్టర్లను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ కారణంతోనే తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొని స్టాక్ పతనమైందని చెప్పొచ్చు. కిందటి సెషన్లో ఈ కేపీఐటీ స్టాక్ ధర రూ. 671.55 వద్ద ముగియగా ఇవాళ జులై 1న (బుధవారం) చూస్తే నేరుగా 10 శాతం లోయర్ సర్క్యూట్‌తో రూ. 604.40 వద్ద ఓపెన్ అయింది. ఇదే ఇవాళ్టి గరిష్ఠ ధర. అంటే ఓపెనింగ్ ప్రైస్ దగ్గరి నుంచి ఇంకా పడుతూనే వచ్చింది. ఈ క్రమంలోనే ఇంట్రాడేలో ఒక దశలో ఈ స్టాక్ ఏకంగా 16 శాతానికిపైగా తగ్గి రూ. 559.20 వద్ద కనిష్ఠ స్థాయిల్ని తాకింది. ఇదే ఈ స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర కూడా కావడం గమనార్హం.స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 1328 గా ఉండగా అక్కడి నుంచి చూస్తే రికార్డు స్థాయిలో 55 శాతానికిపైగా ఈ స్టాక్ పడిపోయిందని చెప్పొచ్చు. ప్రస్తుతం వార్త రాసే సమయంలో ఉదయం 11.25 గంటలకు ఈ స్టాక్ 16 శాతం నష్టంతో రూ. 565 స్థాయిలో కొనసాగుతోంది. కంపెనీ మార్కెట్ విలువ రూ. 15.47 వేల కోట్లుగా ఉంది. గత 5 రోజుల్లో 24 శాతం తగ్గగా, 6 నెలల్లోనే 51 శాతం పతనమైంది. దీంతో ఇన్వెస్టర్లకు ఈ స్టాక్ తీరని నష్టాల్ని మిగిలిస్తూనే ఉంది. కంపెనీ విడుదల చేసిన తాజా ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి సంబంధించి బిజినెస్ అప్డేట్లో క్లయింట్స్ నుంచి వచ్చే డీల్స్ మందగించినట్లు సంకేతాలు వచ్చాయి. ఆటోమోటివ్, మొబిలిటీ రంగంలో సాఫ్ట్వేర్ సేవలు అందించే ఈ కంపెనీ వృద్ధి రేటు రాబోయే రోజుల్లో కాస్త తగ్గొచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలు జరిపారు. డాలర్ ఆధారిత ఆదాయం కూడా క్షీణించొచ్చని అప్డేట్లో పేర్కొంది. ఈ బలహీనమైన అవుట్ లుక్ నేపథ్యంలో పలు బ్రోకరేజీలు కూడా స్టాక్ రేటింగ్ తగ్గించి, టార్గెట్ ప్రైస్ తగ్గించేశాయి. దీంతో స్టాక్ పతనం అవుతూ వస్తోందని తెలుస్తోంది.ఇక భారత స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే సెన్సెక్స్ ప్రస్తుతం వార్త రాసే వేళ దాదాపు 500 పాయింట్లు పెరిగి 77 వేలకు సమీపంలో ఉంది. నిఫ్టీ 150 పాయింట్లు పుంజుకొని 24 వేల మార్కు వద్ద కదలాడుతోంది. గమనిక: పైన ఇచ్చినది కేవలం సమాచారమే. పెట్టుబడులకు సిఫార్సు అసలే కాదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల నుంచి సలహాలు తీసుకోవడం మంచిది.