
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ప్రత్యామ్నాయం తామే అని ఎంపీ డీకే అరుణ అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇకపై బీజేపీ హవా మొదలవుతుందని తెలిపారు.
హైదరాబాద్, జూన్ 30: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ప్రత్యామ్నాయం తామే అని ఎంపీ డీకే అరుణ అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇకపై బీజేపీ హవా మొదలవుతుందని తెలిపారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర సహ ఇన్చార్జ్ నితిన్ నబీన్ మూడు రోజుల పర్యటన ముగిసిన సందర్భంగా ఏబీఎన్‌తో ఆమె మాట్లాడారు. మూడు రోజుల పర్యటనలో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన అనేక కీలక అంశాలు, భవిష్యత్తు కార్యాచరణపై విస్తృతంగా చర్చలు జరిగాయని చెప్పారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా నాయకులంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని డీకే అరుణ పేర్కొన్నారు. గ్రూపు రాజకీయాలకు తావులేకుండా, అందరూ ఒకే తాటిపై నడవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఇకపై తమ పార్టీకి కేవలం ‘అధికారమే ఏకైక నినాదం’ అని, ఆ దిశగానే ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు శ్రమించబోతున్నారని ఆమె స్పష్టం చేశారు.
తెలంగాణ సమాజానికి ప్రస్తుత తరుణంలో నరేంద్ర మోదీ నాయకత్వం, పాలన ఎంతో అవసరమని, అందుకే ‘మోదీ పాలననే తెలంగాణకు అవసరం’ అనే ప్రధాన ట్యాగ్‌లైన్‌తో తాము ప్రజల్లోకి వెళ్తామని డీకే అరుణ వివరించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు, చేస్తున్న అభివృద్ధిని నినాదంగా మార్చుకుని రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి జిల్లాను చుట్టేసేలా భారీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, రేవంత్ రెడ్డి అసలు స్వరూపాన్ని, ఆయన నైజాన్ని ప్రజల ముందు పూర్తిగా ఎండగడతామని చెప్పారు. గతంలో పాలించిన కేసీఆర్ కుటుంబానికి, ప్రస్తుతం పాలిస్తున్న రేవంత్ రెడ్డికి అసలైన ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ మాత్రమేనని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదగడం ఖాయమని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.
కడప స్టీల్ ప్లాంట్ పనులకు ముహూర్తం ఫిక్స్
పారిశ్రామిక హబ్‌గా ఆంధ్రప్రదేశ్: మంత్రి టీజీ భరత్