
ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీఎల్ (ఆంధ్రా ప్రీమియర్ లీగ్) 2026 ఫైనల్ మ్యాచ్ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది.
మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఈ హోరాహోరీ పోరుకు వేదికైంది. భీమవరం బుల్స్, సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్లు టైటిల్ కోసం తలపడ్డాయి. ఈ ఫైనల్ పోరుకు రాష్ట్ర ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.స్టేడియంలోని ఉత్సాహభరిత వాతావరణాన్ని చూసి ఆయన తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. స్టేడియంలో తాను కూర్చున్న ఫొటోలను షేర్ చేస్తూ.. "ప్రేక్షకులు.. క్రికెట్.. ఇక్కడి వాతావరణం.. అత్యుత్తమంగా ఉన్న మంగళగిరిలో నేను" అంటూ ట్వీట్ చేశారు. లోకేశ్ రాకతో ఫైనల్ మ్యాచ్‌కు మరింత శోభ చేకూరింది.క్రికెట్ అభిమానుల కేరింతలు, హోరాహోరీగా సాగిన మ్యాచ్‌తో మంగళగిరి స్టేడియంలో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర నలుమూలల నుంచి క్రీడాభిమానులు ఈ ఫైనల్ పోరును వీక్షించేందుకు తరలివచ్చారు.