
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పటికే ఈ ఏడాది సగం గడిచింది. ప్రథమార్థంలో అలరించిన చిత్రాలు కొన్నే. ఈ క్రమంలో 2026 ద్వితీయార్థంపైనే అటు ఇండస్ట్రీ, ఇటు ప్రేక్షకుల ఆశలు.
మరి ఈ ఏడాది ప్రేక్షకులు అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న చిత్రాలేంటో తెలుసా? మూవీ రేటింగ్స్, సమాచారం, విశ్లేషణలు అందించే ఐఎండీబీ ఆ జాబితాను విడుదల చేసింది. ఊహించినట్లుగానే అందులో ‘రామాయణ: పార్ట్1’ టాప్‌లో నిలిచింది. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రలు పోషించారు. రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల కానుంది. పార్ట్1 దీపావళి కానుకగా నవంబర్ 6, 2026 ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక జాబితాలో ‘ఆల్ఫా’(హిందీ) రెండో స్థానం దక్కించుకుంది. శివ్ రావేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అలియా భట్, శార్వరీ వాఘ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జులై 3న థియేటర్లలో విడుదల కానుంది. ఇక, యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘టాక్సిక్’ (కన్నడ) ఈ లిస్ట్‌లో మూడో స్థానంలో నిలిచింది. కియార, నయనతార, రుక్మిణీ వసంత్, హ్యుమా ఖురేషీ, తారా సుతారియా తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ భారీ యాక్షన్ మూవీని పలు వాయిదాల తర్వాత, ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
తదుపరి స్థానాల్లో.. సల్మాన్ ఖాన్ ‘కింగ్’, అజయ్ దేవగణ్ ‘ధమాల్ 4’, అజయ్ దేవ్‌గణ్ ‘దృశ్యం 3’, సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, ‘మీర్జాపూర్ ది మూవీ’, అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ ‘హైవాన్’, శ్రద్ధాకపూర్ ‘ఈఠ’, ఇమ్రాన్ హష్మీ ‘అవారాపన్’, సన్నీ దేవోల్, అక్షయ్ఖన్నా ‘ఇక్కా’, శింబు ‘అరసన్’, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఖలీఫా’, దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’, విజయ్ దేవరకొండ ‘రణబాలి’, అనీత్ పద్దా, విశాల్ జెఠ్వా ‘శక్తి శాలిని’, అథర్వ మురళి ‘ఇదయం మురళి’, సందీప్ కిషన్ ‘సిగ్మా’, సిద్ధార్థ్ మల్హోత్రా ‘వివన్ - ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ ఉన్నాయి. టాప్-10లో ఒక్క తెలుగు చిత్రానికీ చోటు దక్కకపోవడం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.