న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఇవాళ 76వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మరో వైపు భారతీయ జనతా పార్టీ మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప్ అభియాన్ ప్రచారాన్ని చేపట్టింది. మోదీ ప్రజాజీవితానికి 25 ఏళ్లు నిండిన నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 17వ తేదీ ఆయన పుట్టిన రోజు కాగా, ఇక అక్టోబర్‌లో ఆయన ప్రజాజీవితానికి 25 ఏళ్లు నిండనున్నాయి. మోదీ జన్మదినం సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, శివసేనా ప్రెసిడెంట్ ఏకనాథ్ షిండే, ఎల్జీపీ ప్రెసిడెంట్ చిరాగ్ పాశ్వాన్‌తో పాటు మూడు చోట్ల కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వారాణాసిలో చంద్రబాబు, పాశ్వాన్ పాల్గొంటారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. మోదీ ఆరోగ్యాన్ని కోరుకుంటూ పూజలు చేయనున్నారు. వారాణాసిలో సుమారు 51 మంది బైకర్లు గంగా నదిలో నీటిని తీసుకుని కాశీ విశ్వనాథ్ ఆలయంలో జలాభిషేకం నిర్వహించనున్నారు. గుజరాత్‌లోని వాద్నగర్లో కేంద్ర మంత్రి అమిత్ షా ప్రత్యేక కార్యక్రమంలో పాల్గోననున్నారు. వాద్‌నగర్‌లోనే మోదీ జన్మించారు. సిటీలో ఉన్న జగన్నాథ్ టెంపుల్లో షా పూజలు చేయనున్నారు. షిండేతో పాటు అనుప్రియా పాటిల్ ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక ఉజ్జెయినిలో బీజేపీ అధ్యక్షుడు నితిన్ నిబిన్ ప్రత్యక పూజలు చేయనున్నారు. ఢిల్లీలో రక్తదాన శిబిరాన్ని కూడా ప్రారంభించనున్నారు. 1950, సెప్టెంబర్ 17వ తేదీన వాద్నగర్లో మోదీ జన్మించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జన్మించిన తొలి ప్రధాని ఆయనే కావడం విశేషం. ఇక గుజరాత్ సీఎం ఆయన 2001, అక్టోబర్ 7వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆయన ప్రజాజీవితానికి 25 ఏళ్లు పూర్తి కానున్నాయి. మోదీకి బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. మోదీ నాయకత్వంలో దేశం వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా విశ్వాసంతో ముందుకు వెళ్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. సడలని పట్టుదలతో మోదీ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని అస్సాం సీఎం హిమంత శర్మ అన్నారు. మోదీ రాజకీయ జర్నీ .. త్యాగానికి, జాతీయ సేవకు, మొక్కవోని దీక్షకు నిదర్శనమని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానికి బర్త్‌డే గ్రీటింగ్స్ చెప్పిన రాష్ట్రపతి ముర్ము తన ఎక్స్‌లో రియాక్ట్ అయ్యారు.సుపరిపాలనలో కొత్త ప్రమాణాలను మోదీ నెలకొల్పినట్లు ఆమె అన్నారు. దేశ సమగ్ర అభివృద్ధికి ఆయన కొత్త మార్గదర్శనం చేస్తున్నట్లు చెప్పారు. प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिन की हार्दिक बधाई और शुभकामनाएं। विगत 25 वर्षों में मुख्यमंत्री और प्रधानमंत्री के कार्यकाल में आपने सुशासन के अनेक नए प्रतिमान स्थापित किए हैं तथा समावेशी विकास को अभूतपूर्व गति एवं नई दिशा प्रदान की है। सांस्कृतिक गौरव की भावना के साथ… — President of India (@rashtrapatibhvn) September 17, 2026