
జెరూసలేం, సెప్టెంబర్ 13: ఇజ్రాయెల్ ప్రధానులు మేకప్, హెయిర్ కట్ (కేశాలంకరణ) కోసం అక్కడి ప్రభుత్వం రూ.4.49 కోట్లు ఖర్చు చేసినట్టు గణాంకాలు విడుదలయ్యాయి. 2019 జనవరి నుంచి 2026 ఆగస్టు మధ్యకాలంలో అత్యధికకాలం బెంజమిన్ నెతన్యాహు పదవిలో ఉన్నారు. మొత్తం వ్యయం రూ.4.49 కోట్లలో 90శాతం నెతన్యాహు, ఆయన భార్య సారా నెతన్యాహుకు సంబంధించినదే ఉండటం ఇజ్రాయెల్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ‘మూవ్మెంట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్’ తరఫున ఓ న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం పై సమాచారాన్ని విడుదల చేసింది. కేశాలంకరణ, మేకప్ కోసం ప్రభుత్వం చేస్తున్న వ్యయం ఏటా గణనీయంగా పెరిగినట్టు గణాంకాలు పేర్కొన్నాయి. నాఫ్తాలీ బెన్నెట్, యైర్ లాపిడ్ ప్రధానులుగా పనిచేసిన 2022లో ఈ ఖర్చులు కేవలం రూ.26.34లక్షలుగా ఉంది. నెతన్యాహు తిరిగి ప్రధాని కాగానే, ఆ ఏడాది ఖర్చు రూ.97.52 లక్షలకు చేరుకుంది. ఇక 2025లో అత్యధికంగా రూ.1.06 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. విదేశీ పర్యటనల వేళ దుస్తులు, ఆతిథ్య ఖర్చులపై నెతన్యాహు చేసిన వ్యయం రూ.1.28 కోట్లుగా ఉంది.





