
పోలీస్‌ పరీక్షల ప్రత్యేకం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పునరుత్పాదక జీవ వనరులను వినియోగించి బయోటెక్నాలజీ ఆధారంగా ఆహారాన్ని, శక్తిని, పదార్థాలను, సేవలను సుస్థిరంగా ఉత్పత్తి చేయడమే బయో ఎకానమీ లేదా జీవ ఆర్థిక వ్యవస్థ. జీవ ఆర్థిక శాస్త్రం, సాంకేతికతల మేళవింపులతో తక్కువ కర్బన వృద్ధిని, సుస్థిరాభివృద్ధిని సాధించడమే జీవ ఆర్థిక శాస్త్ర లక్ష్యం. ఈ వ్యవస్థ ప్రాథమికంగా శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి, పునరుత్పాదక జీవ వనరుల వినియోగాన్ని అధికం చేస్తుంది. బయోటెక్నాలజీ, ఏఐ, బయో మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగాల అనుసంధానంతో ఈ వ్యవస్థ పనిచేస్తుంది. క్లైమేట్‌ లక్ష్యాలను, చక్రీయ ఆర్థిక వ్యవస్థను బలపరుస్తుంది. జీ వవైవిధ్యం, మేధో సంపత్తితో కూడిన శాస్త్ర సాంకేతిక రంగ నైపుణ్యం, అత్యంత చవకైన మౌలిక వసతులు కలిగిన తయారీ రంగం, డిజిటల్, బయోటెక్నాలజీ రంగ అనుసంధానం మొదలైన అంశాలు భారత బయో ఎకానమీ వృద్ధికి దోహదపడుతున్నాయి. నీతి ఆయోగ్‌ జులై 2026 రోడ్‌ మ్యాప్‌ ప్రకారం, 2035 నాటికి బయో ఎకానమీ 691 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుంది. 2047 నాటికి 2.6 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంటుంది. భారత్‌ స్వయం సమృద్ధి, హరితవృద్ధి వ్యూహ లక్ష్య సాధనలో భాగంగా రూపొందించిన BioE3 పాలసీ (బయోటెక్నాలజీ ఫర్‌ ఎకానమీ, ఎన్విరాన్‌మెంట్, ఎంప్లాయిమెంట్‌) బయో ఎకానమీ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించి పదివేలకు పైగా బయోటెక్‌ స్టార్టప్స్‌కు చోదక శక్తిగా పనిచేస్తుందని భావిస్తున్నారు. జీవ ఆర్థిక వ్యవస్థ దశలు - వృద్ధి సంప్రదాయ బయో ఎకానమీ: ఇది 2000 సంవత్సరానికి ముందు దశ. దీనిలో జీవ ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా సహజ వనరులైన వ్యవసాయం, అడవులు, మత్స్య సంపదల వినియోగంతో ప్రారంభమైంది. ఈ దశలో శాస్త్ర సాంకేతిక రంగాల వినియోగం తక్కువగా ఉండేది. జీవ వనరుల నుంచి ఆహారం, పీచు, ముడి పదార్థాల ఉత్పత్తి జరిగేది. బయో టెక్నాలజీ ఆధారిత బయో ఎకానమీ: ఈ దశ 2000-20 మధ్య నెలకొన్న దశ. ఈ దశలో ఆధునిక బయోటెక్నాలజీ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. పరిశ్రమల్లో వివిధ బయో ఎంజైమ్స్‌ వినియోగం పెరగడంతో జీవ ఆధారిత పరిశ్రమలు ఊపందుకున్నాయి. ఫార్మాస్యూటికల్స్‌ (వ్యాక్సిన్స్, బయోలాజిక్స్‌), జన్యు పరివర్తన జీవశాస్త్రం తదితరాలు ఈ దశలోని కీలక అంశాలు. వీటితో జీవ పరిశ్రమల వృద్ధి వేగవంతమై వాణిజ్య పరిశ్రమలుగా రూపాంతరం చెందాయి. చక్రీయ బయో ఎకానమీ/ అధునాతన ఎకానమీ: కృత్రిమ మేధ, బయాలజీ, బయో ఇన్పర్మాటిక్‌ మొదలైన విజ్ఞాన శాస్త్ర పురోగతితో జీవ ఇంధనాలు, జీవ ప్లాస్టిక్స్, ప్రెసిషన్‌ మెడిసిన్, నెట్‌ జీరో ఉద్గారాలను తగ్గించే కర్బన వనరులు, వనరుల చక్రీయ వినియోగం (సర్క్యులర్‌ రిసోర్స్‌) మొదలైన అంశాలపై పరిశోధనలు ఈ దశలో వేగవంతమయ్యాయి. జీవ ఆర్థిక వ్యవస్థ హై వాల్యూ ఎకానమీగా గుర్తింపు పొందడమే కాకుండా సుస్థిరాభివృద్ధి, నెట్‌ జీరో ఉద్గార లక్ష్య సాధనలను సుగమం చేసింది. బయో ఎకానమీలో వివిధ రంగాల వాటా: జీవ ఇంధనాలు జీవ ప్లాస్టిక్స్‌ మొదలైన వాటితో కూడిన బయో ఇండస్ట్రీస్‌ వాటా 46%, వాక్సిన్స్, బయోలాజిక్స్‌ సమ్మిళితమైన బయో ఫార్మా 33%, రిసెర్చ్, బయో ఇన్ఫర్మాటిక్‌ టెక్నాలజీతో సేవలు అందించే బయో సర్వీసెస్‌ రంగం 13%, జీవ ఎరువులు, జన్యుపరివర్తిత పంటలుతో కూడిన బయో అగ్రికల్చర్‌ 8% వాటాను కలిగి ఉంది. 2014లో పది బిలియన్‌ డాలర్లుగా ఉన్న బయో ఎకానమీ రంగం 2024లో 165.7 బిలియన్‌ డాలర్లకు చేరుకుందని, 2030 నాటికి 300 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో తెలియజేసింది. అంతేకాకుండా ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బయో ఎకానమీగా భారత్‌ నిలిచిందని తెలిపింది. భారత ప్రభుత్వం 2024లో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ ఆధ్వర్యంలో ఈ పాలసీని రూపొందించింది. భారతదేశ పారిశ్రామిక రంగాన్ని వనరుల వెలికితీత నమూనా నుంచి పునరుత్పాదక చక్రీయ బయో ఎకానమీ దిశగా మళ్లించడమే దీని లక్ష్యం. బయోటెక్నాలజీ రంగ అభివృద్ధి ద్వారా భారత జీడీపీ వృద్ధిని వేగవంతం చేస్తూ 2030 నాటికి 300 బిలియన్‌ డాలర్లను ఈ రంగం ద్వారా సాధించాలని లక్ష్యంగా నిర్దేశించారు. వాతావరణ మార్పుల నియంత్రణ, కర్బన తటస్థ వస్తువుల ఉత్పత్తి, 2070 నాటికి దేశంలో నెట్‌ జీరో ఉద్గారం, లైఫ్‌ స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ ్బలిఖినీన్శి లక్ష్యాలను చేరుకోవడానికి కావాల్సిన విధివిధానాలను ఈ పాలసీ ద్వారా రూపొందించారు. అత్యంత నైపుణ్యం కలిగిన మానవ వనరులను వినియోగించుకుని Tier - II, Tier - III నగరాలను ఆయా ప్రాంతాల్లో ఏర్పడిన జీవ ద్రవ్యరాశి ఆధారంగా బయో మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మిషన్‌ లెర్నింగ్‌ (AIML) ఆధారంగా అత్యంత సంక్లిష్టమైన జీనోమిక్‌ డేటాను, మోడల్‌ మెటబాలిక్‌ పాత్‌ వేస్‌ ద్వారా జీవశాస్త్ర అన్వేషణలను వేగవంతం చేయనున్నారు.





