
ర ష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఆర్థిక ఆంక్షలు, ఆధిపత్య బలప్రదర్శనలు, వాణిజ్య సుంకాల నడుమ నేడు ప్రపంచం మునుపెన్నడూ లేనంతగా భౌగోళిక రాజకీయ విభజనను ఎదుర్కొంటోంది. ఈ సమయంలో భిన్న ప్రయోజనాలు, వైఖరులు కలిగిన బ్రిక్స్‌ దేశాలు దిల్లీ భేటీలో ఉమ్మడి ప్రకటనను వెలువరించగలవా అనే సందేహం అందరిలో నెలకొంది. మేలో జరిగిన కూటమి విదేశాంగ మంత్రుల సమావేశంలో అలాంటి ఏకాభిప్రాయం కరవవ్వడం ఆ అనుమానాన్ని ఇంకా పెంచింది. అంతర్జాతీయంగా శాంతి వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్న బ్రిక్స్‌లో కీలక పాత్రధారి అయిన మాస్కో ఒకపక్క ఉక్రెయిన్‌లో విధ్వంసం సృష్టిస్తుంటే- అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధోన్మాదం మూలంగా ఇరాన్, యూఏఈ మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ బ్రిక్స్‌ సదస్సును దిగ్విజయంగా నిర్వహించి న్యూదిల్లీ డిక్లరేషన్‌కు సభ్యదేశాల సంపూర్ణ సమ్మతిని సాధించడంలో భారత్‌ విశేష దౌత్య ప్రజ్ఞను కనబరచింది. నేరుగా ఎవరినీ వేలెత్తి చూపకుండానే అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించాలని పిలుపిచ్చిన సంయుక్త ప్రకటన- వివాదాల పరిష్కారానికి సంప్రదింపుల మార్గాన్ని సూచించింది. అంతర్గతంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ పరస్పర ప్రయోజనాలకోసం కలిసి పనిచేస్తామనే సందేశాన్ని అందించడంలో బిక్స్‌ శిఖరాగ్ర సదస్సు సఫలీకృతమైంది! తనకు నచ్చని దేశాలపై ఒత్తిడి పెంచడానికి డాలర్‌ను అమెరికా ఒక ఆయుధంగా వాడుతోంది. అగ్రరాజ్యాన్ని నిలువరించాలంటే ముందు డాలర్‌ ప్రాబల్యానికి గండికొట్టాలని రష్యా, చైనాలు తలపోస్తున్నాయి. కానీ- అమెరికా, ఐరోపాలతో ఇండియాకు బలమైన ఆర్థిక, సాంకేతిక, రక్షణ సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డాలర్‌ పొడగిట్టని కూటమిగా, పాశ్చాత్య దేశాలకు వైరిపక్షంగా బ్రిక్స్‌ పేరుపడకుండా భారత్‌ జాగ్రత్త వహించింది. వర్ధమాన దేశాల ప్రయోజనాల పరిరక్షణకు తోడ్పడే వేదికగా బ్రిక్స్‌ పరపతి పెంపునకు ప్రాధాన్యమిచ్చింది. అదే సమయంలో స్థానిక కరెన్సీల్లో చెల్లింపులకు మద్దతునిస్తూ సరళతర వాణిజ్య విధానాల వైపు మొగ్గుచూపింది. అసంబద్ధ సుంకాలు, ఆంక్షలపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అందరితో సమదూరం పాటిస్తూ, ప్రపంచ ప్రగతికి ప్రతిబంధకాలయ్యే ఏకపక్ష నిర్ణయాలను గట్టిగా నిరసించింది. ఉగ్రవాదంపై కఠిన వైఖరి, భద్రతా మండలి సంస్కరణలు, సరఫరా గొలుసుల బలోపేతం వంటి తన చిరకాల ఆకాంక్షలకు దిల్లీ డిక్లరేషన్‌లో చోటుకల్పించి ఇండియా తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని తెలియజెప్పింది. దిల్లీ, బీజింగ్‌లు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా మెలగాలన్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అభిలాష వినసొంపుగా ఉంది. ప్రధాని మోదీ సూచించినట్లు సరిహద్దుల్లో శాంతి సుస్థిరతలు నెలకొంటేనే ఉభయ దేశాల నడుమ మైత్రి దృఢమవుతుంది. గత ఆర్థిక సంవత్సరంలో చైనాతో మన వాణిజ్య లోటు 11 వేల కోట్ల డాలర్లకు పైబడింది. ఇది తగ్గాలంటే- వ్యాపార అడ్డంకులను తొలగించి, భారత కంపెనీలకు చైనీస్‌ మార్కెట్‌లో అవకాశాలు పెంచాలి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ భేటీలో ప్రస్తావితమైన 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పదివేల కోట్ల డాలర్లకు పెంచే లక్ష్యం సాకారం కావాలంటే- చమురు సరఫరాలను మించి దిల్లీ, మాస్కో బంధం విస్తరించాలి. ఇరాన్, యూఏఈ, ఇథియోపియా, మలేసియా, వియత్నాం, ఈజిప్ట్‌ తదితర దేశాల నేతలతోనూ కీలక ఖనిజాలు, సాంకేతికతలు, రక్షణ, ఇంధనం వంటి రంగాల్లో సహకారంపై మోదీ చర్చలు సాగించారు. బహుళ ధృవ ప్రపంచంలో అంశాల వారీగా భావసారూప్యత కలిగిన దేశాలతో ఉభయతారకమైన స్నేహ సంబంధాల వృద్ధికి భారతావని ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఈ సమావేశాలు చాటిచెప్పాయి! .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





