
తొలి టీ20లో అఫ్గానిస్థాన్‌పై భారత్‌ ఘనవిజయం అభిషేక్‌ 82 32 బంతుల్లో 7×4, 7×6 అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌ను టీమ్‌ఇండియా ఘనంగా ఆరంభించింది. అభిషేక్‌ వీరవిహారం చేసిన వేళ.. తొలి మ్యాచ్‌లో అఫ్గాన్‌ను చిత్తుగా ఓడించింది. బంతితో ప్రత్యర్థికి కళ్లెం వేసిన భారత్‌.. లక్ష్యాన్ని 38 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. పేసర్‌ అర్ష్‌దీప్‌ గొప్పగా రాణించాడు. అభిషేక్‌ శర్మ (82; 32 బంతుల్లో 7×4, 7×6) రెచ్చిపోవడంతో ఆదివారం అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20లో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట అఫ్గానిస్థాన్‌ 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అజ్మతుల్లా (64 నాటౌట్‌; 44 బంతుల్లో 4×4, 4×6) టాప్‌ స్కోరర్‌. అర్ష్‌దీప్‌ (3/19), వరుణ్‌ చక్రవర్తి (1/16), అక్షర్‌ పటేల్‌ (1/27) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. అభిషేక్‌తో పాటు ఇషాన్‌ కిషన్‌ (42; 33 బంతుల్లో 5×4, 1×6) మెరవడంతో లక్ష్యాన్ని భారత్‌.. 13.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా ఛేదించింది. రెండో టీ20 మంగళవారం జరుగుతుంది. దంచేశారు..: ఛేదనలో ఓపెనర్‌ సంజు శాంసన్‌ (10) త్వరగానే నిష్క్రమించినా.. అది భారత్‌ ఇన్నింగ్స్‌పై ఎలాంటి ప్రభావం చూపించలేదు. కారణం మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ. అతడు.. అఫ్గాన్‌ బౌలింగ్‌ను ఉతికారేశాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లు బాదేస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మూడో ఓవర్లో అజ్మతుల్లా బౌలింగ్‌లో సిక్స్, ఫోర్‌ దంచేసిన అతడు.. అదే ఊపు కొనసాగించాడు. ఇషాన్‌ అతడికి సహకరించాడు. అభిషేక్‌ ఫోర్, సిక్స్‌.. ఇషాన్‌ ఫోర్, సిక్స్‌ బాదడంతో ఓ ఓవర్లో ఫారూఖి 26 పరుగులు సమర్పించుకున్నాడు. అభిషేక్‌ 22 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత రషీద్‌ ఓవర్లో వరుసగా 6, 4 బాదిన అతడు.. నూర్‌ను వరుసగా 6, 6తో శిక్షించాడు. 10 ఓవర్లలో 130/1తో టీమ్‌ఇండియా విజయం ఖాయమైపోయింది. అభిషేక్, ఇషాన్‌ ఔటైనా.. కెప్టెన్‌ శ్రేయస్‌ (8 నాటౌట్‌), తిలక్‌ వర్మ (3 నాటౌట్‌) లాంఛనం పూర్తి చేశారు. అభిషేక్, ఇషాన్‌ జంట రెండో వికెట్‌కు 53 బంతుల్లోనే 121 పరుగులు జోడించింది. అఫ్గాన్‌ కట్టడి: అంతకుముందు భారత్‌ బంతితో అఫ్గానిస్థాన్‌కు కళ్లెం వేసింది. నిజానికి అఫ్గాన్‌ 158 చేయడం కూడా ఎక్కువే. అర్ష్‌దీప్‌ అక్షర్, వరుణ్‌ చాలా పొదుపుగా బౌలింగ్‌ చేశారు. బుమ్రా (1/26).. 16 డాట్‌ బాల్స్‌ వేశాడు. అఫ్గాన్‌ టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగగా.. గుర్బాజ్‌ను ఔట్‌ చేయడం ద్వారా రెండో బంతికే ఆ జట్టును బుమ్రా దెబ్బతీశాడు. నాలుగో ఓవర్లో 38/1తో ఉన్న అఫ్గాన్‌.. భారత బౌలర్ల ధాటికి 5 పరుగుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. ఇషాన్‌ కిషన్‌ సూపర్‌ ఫీల్డింగ్‌కు ఇబ్రహీం జద్రాన్‌ (11) రనౌట్‌ కాగా.. సెదికుల్లా (13)ను అర్ష్‌దీప్, నైబ్‌ (2)ను అక్షర్, రసూలి (2)ని వరుణ్‌ చేశారు. అయితే 43/5తో నిలిచిన అఫ్గానిస్థాన్‌ను అజ్మతుల్లా, నబి (33) ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు 83 పరుగులు జోడించారు. 17వ ఓవర్లో నబిని అర్ష్‌దీప్‌ ఔట్‌ చేయడంతో ఈ భాగస్వామ్యం విడిపోయింది. నితీష్‌ (2 ఓవర్లలో 30), దూబె (1 ఓవర్లో 21) భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఆఖరి మూడు ఓవర్లలో అఫ్గాన్‌ 2 వికెట్లు కోల్పోయి 29 పరుగులు చేసింది. అఫ్గానిస్థాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి) అభిషేక్‌ (బి) బుమ్రా 0; ఇబ్రహీం జద్రాన్‌ రనౌట్‌ 11; సెదికుల్లా (సి) బుమ్రా (బి) అర్ష్‌దీప్‌ 13; నైబ్‌ (సి) నితీశ్‌ (బి) అక్షర్‌ 2; రసూలి (బి) వరుణ్‌ 2; అజ్మతుల్లా నాటౌట్‌ 64; నబి (బి) అర్ష్‌దీప్‌ 33; రషీద్‌ ఖాన్‌ (సి) అక్షర్‌ (బి) అర్ష్‌దీప్‌ 1; నూర్‌ రనౌట్‌ 0; ముజీబ్‌ నాటౌట్‌ 9; ఎక్స్‌ట్రాలు 21 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 156; వికెట్ల పతనం: 1-5, 2-38, 3-39, 4-41, 5-43, 6-126, 7-131, 8-131; బౌలింగ్‌: బుమ్రా 4-0-26-1; అర్ష్‌దీప్‌ 4-0-19-3, అక్షర్‌ 4-0-27-1; వరుణ్‌ చక్రవర్తి 4-0-16-1; నితీశ్‌ 2-0-30-0; అభిషేక్‌ 1-0-8-0; దూబె 1-0-21-0 భారత్‌ ఇన్నింగ్స్‌: శాంసన్‌ (సి) రసూలి (బి) అజ్మతుల్లా 10; అభిషేక్‌ (సి) రషీద్‌ ఖాన్‌ (బి) నబి 82; ఇషాన్‌ కిషన్‌ (సి) రషీద్‌ ఖాన్‌ (బి) నబి 42; శ్రేయస్‌ నాటౌట్‌ 8; తిలక్‌ నాటౌట్‌ 3; ఎక్స్‌ట్రాలు 12 మొత్తం: (13.4 ఓవర్లలో 3 వికెట్లకు) 157; వికెట్ల పతనం: 1-18, 2-139, 3-152; బౌలింగ్‌: ఫారూఖి 2-0-38-0; ముజీబ్‌ 2-0-16-0; అజ్మతుల్లా 1-0-14-1; నబి 3-0-28-2; రషీద్‌ ఖాన్‌ 3.4-0-34-0; నూర్‌ అహ్మద్‌ 2-0-25-0 దిల్లీ: ఓ అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లో తొలిసారి జాతీయ గేయం వందేమాతరాన్ని వినిపించారు. ఆదివారం భారత్, అఫ్గానిస్థాన్‌ మధ్య తొలి టీ20 నేపథ్యంలో జాతీయ గీతం జనగణమనకు ముందు వందేమాతరాన్ని వినిపించారు. ఇకపై ప్రతి సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు ముందు వందేమాతరం వినిపిస్తారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





