
మెరిసిన షెఫాలి, స్మృతి విజృంభించిన శ్రీచరణి, దీప్తి ఫైనల్లో లంకపై ఘనవిజయం ఆసియాకప్‌ టీ20 టోర్నీలో భారత అమ్మాయిలు అదరగొట్టారు. ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మరోసారి కప్‌ను పట్టేశారు. శ్రీలంకతో ఫైనల్లో మొదట షెఫాలి వర్మ, స్మృతి మంధాన మెరుపులతో భారీ స్కోరు చేసిన భారత్‌.. ఆపై శ్రీచరణి, దీప్తి విజృంభించడంతో ప్రత్యర్థిని కుప్పకూల్చి ఘనవిజయాన్ని అందుకుంది. భారత్‌ ఆసియాకప్‌ గెలవడమిది ఎనిమిదోసారి. ఆసియాకప్‌ టీ20 టోర్నీలో భారత మహిళల జట్టే విజేతగా నిలిచింది. టోర్నీలో ఒక్క ఓటమి లేకుండా హర్మన్‌ప్రీత్‌ బృందం టైటిల్‌ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్‌ 72 పరుగుల తేడాతో లంకను చిత్తు చేసింది. షెఫాలి వర్మ (68; 39 బంతుల్లో 9×4, 2×6), స్మృతి మంధాన (59; 39 బంతుల్లో 5×4, 3×6) మెరుపులతో మొదట భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. ఛేదనలో తెలుగమ్మాయి శ్రీచరణి (4/20), దీప్తి శర్మ (3/19) విజృంభించడంతో లంక 20 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. చమరి ఆటపట్టు (36), నీలాక్షిక (22), విష్మి (20) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. శ్రీచరణి, దీప్తి మాయాజాలం: ఛేదనలో లంకకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్‌ ఇమేషా (4)ని క్రాంతి గౌడ్‌ బౌల్డ్‌ చేసి భారత్‌కు శుభారంభం అందించింది. తొలి ఓవర్లోనే వికెట్‌ పడడంతో లంక బ్యాటర్లు నెమ్మదిగా ఆడారు. 4 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 21 పరుగులే! ఈ స్థితిలో కెప్టెన్‌ చమరి ఆటపట్టు.. షెఫాలి బౌలింగ్‌లో 6, 4తో స్కోరు కదిలించింది. ఆ తర్వాత ప్రేమ బౌలింగ్‌లోనూ చమరి సిక్స్, ఫోర్‌ బాదడంతో 9 ఓవర్లకు 61/1తో లంక కాస్త కోలుకుంది. కానీ సాధించాల్సిన రన్‌రేట్‌ మాత్రం తగ్గలేదు. దీప్తి వేసిన పదో ఓవర్లో భారీ షాట్‌కు వెళ్లిన చమరి.. స్టంపౌట్‌గా వెనుదిరిగింది. అదే ఓవర్లో విష్మి గుణరత్నే (20) కూడా ఔటైపోవడంతో లంకపై ఒత్తిడి మరింత పెరిగింది. 14వ ఓవర్లో హర్షిత (9)ను శ్రీచరణి తన బౌలింగ్‌లోనే క్యాచ్‌ పట్టి డగౌట్‌కు పంపడంతో లంకకు ఇంకో దెబ్బ తగిలింది. సమీకరణం (36 బంతుల్లో 94 పరుగులు) మరింత కఠినంగా మారింది. 16 ఓవర్లో కవీష (7), నీలాక్షిక (22)లను శ్రీచరణి.. తర్వాతి ఓవర్లో హాసిని (1)ని షెఫాలి ఔట్‌ చేయడంతో లంక కనీస పోరాటం చేయలేకపోయింది. చివరి 5 వికెట్లను ఆ జట్టు 11 పరుగులకే కోల్పోయింది. షెఫాలి, స్మృతి మెరుపులు: మొదట భారత్‌ భారీ స్కోరు చేసిందంటే ఓపెనర్లు షెఫాలి, స్మృతి దూకుడే కారణం. టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌ను స్మృతి బౌండరీతో మొదలుపెట్టగా.. తర్వాత షెఫాలి చెలరేగింది. మిథాలి వేసిన మూడో ఓవర్లో రెండు ఫోర్లు, తర్వాత చమరి ఆటపట్టు (5వ ఓవర్‌) బౌలింగ్‌లో 4, 6, 6తో షెఫాలి స్కోరు పెంచింది. స్మృతి కూడా షాట్లకు దిగడంతో 12 ఓవర్లకు 121/0తో భారత్‌ భారీ స్కోరు దిశగా సాగింది. అప్పటికే షెఫాలి 24 బంతుల్లో, స్మృతి 35 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. భారత్‌ జోరు చూస్తే తేలిగ్గా 200 పరుగులు సాధిస్తుందేమో అనిపించింది. కానీ తర్వాత భారత్‌ ఇన్నింగ్స్‌ అనూహ్యంగా కుదుపునకు లోనైంది. కుదురుకున్న షెఫాలి, స్మృతితో పాటు రిచా (17), హర్మన్‌ప్రీత్‌ 14), దీప్తి (5) స్వల్ప వ్యవధిలో ఔటైపోయారు. 38 పరుగుల తేడాతో 5 వికెట్లు పడిపోయాయి. దీంతో భారత్‌ 18.5 ఓవర్లకు 167/5తో నిలిచింది. ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ చివరి రెండు బంతులకు కమలిని (15 నాటౌట్‌; 5 బంతుల్లో 1×4, 1×6).. 4, 6 కొట్టడంతో స్కోరు 180 దాటింది. ఆసియాకప్‌ పదిసార్లు జరిగితే ఎనిమిదిసార్లు (2004, 2005, 2006, 2008, 2012, 2016, 2022, 2026) భారతే విజేతగా నిలిచింది. బంగ్లాదేశ్‌ (2018), శ్రీలంక (2024) ఒక్కోసారి నెగ్గాయి. భారత్‌ టీ20, వన్డే ఫార్మాట్లలో 4సార్ల చొప్పున కప్‌ను గెలిచింది. గత ఏడాది పురుషుల ఆసియా కప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టు.. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) అధ్యక్షుడు మోసిన్‌ నఖ్వి (పాక్‌ మంత్రి, ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌) నుంచి ట్రోఫీ అందుకోవడానికి నిరాకరించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆదివారం ఆసియా కప్‌ మహిళల క్రికెట్‌ టోర్నీ బహుమతి ప్రదానోత్సవానికి కూడా నఖ్వి హాజరు కావడంతో అదే దృశ్యం పునరావృతమైంది. అతడి నుంచి ట్రోఫీని తీసుకోవడానికి భారత జట్టు నిరాకరించింది. భారత్‌ ఇన్నింగ్స్‌: స్మృతి మంధాన రనౌట్‌ 59; షెఫాలి వర్మ (సి) చమరి ఆటపట్టు (బి) ప్రబోద 68; హర్మన్‌ప్రీత్‌ (సి) కవింది (బి) మిథాలి అయోధ్య 14; రిచా ఘోష్‌ (సి) దిల్హరి (బి) చమరి ఆటపట్టు 17; దీప్తి రనౌట్‌ 5; భార్తీ ఫుల్మాలి నాటౌట్‌ 2; కమలిని నాటౌట్‌ 15; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 183; వికెట్ల పతనం: 1-129, 2-132, 3-160, 4-166, 5-167; బౌలింగ్‌: మిథాలి అయోధ్య 4-0-33-1; కవీష దిల్హరి 3-0-29-0; సుగంధిక 4-0-31-0; చమరి ఆటపట్టు 4-0-34-1; చాముది ప్రబోద 4-0-40-1; నీలాక్షిక సిల్వ 1-0-15-0 శ్రీలంక ఇన్నింగ్స్‌: ఇమేషా (బి) క్రాంతి 4; చమరి (స్టంప్డ్‌) రిచా (బి) దీప్తి 36; విష్మి (బి) దీప్తి 20; హర్షిత (సి) అండ్‌ (బి) శ్రీచరణి 9; నీలాక్షిక (సి) కమలిని (బి) శ్రీచరణి 22; కవీష (సి) నందని (బి) శ్రీచరణి 7; హాసిని (సి) శ్రీచరణి (బి) షెఫాలి 1; కౌషిని (బి) దీప్తి 9; సుగంధిక (సి) నందని (బి) శ్రీచరణి 1; మిథాలి (స్టంప్డ్‌) రిచా (బి) ప్రేమ 0; చాముది నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 2 మొత్తం: (20 ఓవర్లలో ఆలౌట్‌) 111; వికెట్ల పతనం: 1-4, 2-62, 3-63, 4-86, 5-100, 6-101, 7-103, 8-104, 9-107; బౌలింగ్‌: క్రాంతి గౌడ్‌ 2-0-8-1; నందని శర్మ 3-0-17-0; షెఫాలి 4-0-23-1; శ్రీచరణి 4-1-20-4; దీప్తి 4-0-19-3; ప్రేమ రావత్‌ 3-0-22-1 .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





