
మక్కాపై హూతీల దాడి యత్నాన్ని ఖండించిన ఇస్లామిక్‌ దేశాలు కైరో: సౌదీలోని పవిత్ర మక్కా నగరంపై యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు దాడికి ప్రయత్నించటంపై ఇస్లామిక్‌ దేశాలు ఆగ్రహం వ్యక్తంజేశాయి. మక్కాను ప్రమాద సూచిక (రెడ్‌లైన్‌)గా అభివర్ణించాయి. 57 ముస్లిం దేశాల కూటమి ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌ తీవ్రంగా ఖండించింది. అయితే.. సౌదీకి సైనిక మద్దతు అందిస్తామని ఇంతవరకూ ఏ దేశమూ ప్రకటించలేదు. ఇరాన్‌ మద్దతు పొందుతున్న హూతీలు తనపై దాడికి దిగడం ప్రపంచంలో అతిపెద్ద చమురు ఎగుమతిదారు అయిన సౌదీని సంక్షోభంలో కూరుకుపోయేలా చేస్తోంది. తన ముడిచమురుకు సురక్షితమైన రవాణా మార్గం కావాలని, తనకు సైనిక సాయం అందాలని సౌదీ కోరుకుంటోంది. ఈ రెండు విషయాల్లోనూ ఇప్పటివరకూ స్పష్టత కనిపించడంలేదు. హూతీల దాడి నేపథ్యంలో సౌదీ అరేబియా సర్కారు కీలక చమురు రవాణా పైప్‌లైన్‌ను మూసివేసిన సంగతి తెలిసిందే. మరోవైపు మక్కాపై తాము దాడికి యత్నించామంటూ సౌదీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని హూతీలు స్పష్టం చేశారు. సౌదీ అరేబియాకు, నాటో సభ్యదేశమైన తుర్కియేకు, అణ్వాయుధం కలిగివున్న పాకిస్థాన్‌కూ మధ్య కుదిరిన త్రైపాక్షిక మక్కా ఒడంబడికకు హూతీల దాడి పరీక్షగా నిలిచింది. దాడి నేపథ్యంలో తమ నుంచి సౌదీ మద్దతు కోరలేదని తుర్కియే, పాకిస్థాన్‌లు తేల్చి చెప్పాయి. దిల్లీ: మక్కా నగరంపై జరిగిన డ్రోన్‌ దాడి యత్నంపై భారత్‌ బుధవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో సత్వరం శాంతి స్థాపన జరగాలని పునరుద్ఘాటించింది. ‘‘మక్కా సమీపంలో జరిగిన డ్రోన్‌ దాడిపై మేం తీవ్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నాం’’ అని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జయస్‌వాల్‌ పేర్కొన్నారు. సౌదీ అరేబియా సార్వభౌమాధికారం కింద ఉన్న భూభాగంపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని తెలిపారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





