
సెప్టెంబరు 21 అంతర్జాతీయ శాంతి దినోత్సవం సముద్రంలో నీరు ఎలాగో.. ఆత్మలో ఉండే శాంతి కూడా అలాంటిదే. అది స్థిరమైన, శాశ్వతమైన స్థితి. అందులో వచ్చే అలలు, ఆటుపోట్లు, సుడులు, అలజడులు- ఇవన్నీ తాత్కాలిక స్థితిగతులే. ఆత్మ సముద్రంలో నీటి వంటిది. అది ఎప్పుడూ శాంతి స్థితిలోనే ఉంటుంది. ఆ శాంతిని భగ్నం చేసేది మనసు. మనసు కారణంగా ఇంద్రియాలు, వాటి వల్ల శరీరం, దాని ప్రభావంతో వ్యక్తి, ఆ వ్యక్తి ద్వారా కుటుంబం, తద్వారా సమాజం మొత్తం అశాంతికి గురి అవుతుంది. అశాంతికి మూల కారణం కాంక్ష. ధనం, అధికారం, పదవి, కీర్తి, సౌఖ్యాల కోసం వెతుకులాట శాంతిని భగ్నం చేస్తుంది. మనసులో ఏదైనా కోరిక ఉన్నదంటే.. దానర్థం ఉన్నదానితో తృప్తి లేదని. తృప్తి లేనిచోట శాంతికి తావు లేదు. మహర్షులు- శాంతిని ఒక స్థితిగా కాక జీవన పరమార్థంగా తెలియజేశారు. మనం సాధారణంగా ఆర్థిక వెసులుబాటు, చక్కటి అనుబంధాలు ఉంటే.. అదే శాంతి అనుకుంటాం. ఇది పైకి కనిపించే శాంతి. కానీ మన సనాతన ధర్మం చూపిన శాంతి ఇంతకంటే భిన్నమైనది, లోతైనది, శాశ్వతమైనది. మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా చలించని ప్రశాంతత అవసరం. వాస్తవానికి మనిషిని కలవరపెట్టి అశాంతికి గురి చేసేది బయట ప్రపంచం కాదు. అసలు యుద్ధం అంతరంగంలోనే జరుగుతుంటుంది. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే శత్రువులు.. నిరంతరం మనపై దాడిచేస్తూ మనల్ని శాంతికి దూరం చేస్తుంటాయి. వాటిని నియంత్రించుకోగలిగితే.. శాంతికి దగ్గరవుతాం. అందుకే మనోచాంచల్యాన్ని శాంతింపచేయాలని వేదాలు, పురాణేతిహాసాలు వివరించాయి. కోరిక తీరడం కాదు, కోరిక లేకపోవడం శాంతి అన్నది ఉపనిషత్‌ వాక్యం. బాహ్య వస్తువులు ఇచ్చే శాంతి, సుఖం తాత్కాలికం. ఆత్మస్థితిని తెలుసుకున్నప్పుడు కలిగే ఆనందమే శాశ్వతం. అదే శాంత స్థితి. ‘స్వార్థపూరితమైన ‘నేను’కు ‘నిన్ను’ చేర్చి.. ‘మనం’గా మారితే.. మనసు శాంతికి నిలయం అవుతుంది’ అని భగవద్గీత; ‘సర్వజీవుల్లో తనను చూసుకున్నప్పుడు ద్వేషం, భేదభావాలకు చోటు ఉండదు, అదే శాంత స్థితి’ అని ఈశావాస్యోపనిషత్తు పేర్కొన్నాయి. రామాయణంలో శాంతికి ప్రతిరూపం రాముడు. తండ్రి దశరథుడు పిలిచి.. ‘తెల్లవారితే పట్టాభిషేకం’ అన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడో, వనవాసం గురించి విన్నప్పుడూ అదే శాంత చిత్తంతో ఉన్నాడు. రావణాసురుడితో యుద్ధానికి కొంత సమయం ముందు కూడా.. అంగదుని రాయబారిగా పంపి, శాంతికి ప్రయత్నించాడు. అది విఫలమై, తెల్లారితే యుద్ధమనగా.. లంకాతీరంలో రాతిపై పడుకుని ఆకాశంలో చంద్రుడ్ని చూస్తూ, సీతమ్మను తలచుకుంటూ ప్రేమ గీతం పాడుకోగలిగాడు. అదీ రాముని సహజ శాంతస్థితి. యుద్ధం గురించిన అలజడి మనసులో ఏ మాత్రం లేని మూర్తీభవించిన శాంతస్వరూపుడు శ్రీరామచంద్రుడు. మనసులో కోరిక ఉన్నంతకాలం శాంతి ఉండదు. దీనికి అత్యుత్తమ ఉదాహరణ మహాభారతంలోని యయాతి మహారాజు చరిత్ర. జీవితంలో రెండు యౌవనాలని అనుభవించినా.. శాంత స్థితిని పొందలేకపోయాడు. చివరికి రాజ్య భోగాల్ని, దైహిక సుఖాల్ని అన్నింటినీ వదిలేసి శాంతి కోసం అన్వేషణా మార్గం వైపు పయనించాడు. భీష్ముడు ధర్మరాజుకు మోక్షధర్మాల్ని బోధిస్తూ- ‘కోరికలు నశించడమే శాంతి సాధనకు మూలం’ అన్నాడు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పశ్చాత్తాపంతో నిండిపోయిన ధర్మరాజుకి భీష్ముడు- కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే.. శాంతి మార్గంలో ఎలా పయనించాలో వివరించాడు. అది నిరంతర సాధనతోనే సాధ్యం. ఏ క్షణంలోనైనా ఆ స్థితి నుంచి పక్కకు జారిపోవచ్చు. అటువంటి సాధనతో శరీరంతో స్వర్గానికి చేరాడు ధర్మరాజు. తన సోదరులు, ద్రౌపది నరకవేదనను, దుర్యోధనాదులు స్వర్గసుఖాల్ని అనుభవించడం చూసి.. అంత సాధన తర్వాత కూడా అశాంతికి గురయ్యాడు. ధర్మరాజు స్వర్గంలోనూ శాంతి సాధన కోసం ఆకాశగంగా తీరంలో తపస్సుకు కూర్చోవడంతో భారతాన్ని ముగించాడు వ్యాసభగవానుడు. అసలు భాగవత రచనకు మూలమే వ్యాసుని మనసులో గూడు కట్టుకున్న అశాంతి. వేద విభజన, బ్రహ్మ సూత్రాలు, మహాభారతం, అష్టాదశ పురాణాలని బోధించిన వ్యాసమహర్షి.. భాగవత రచనతో తనలోని అశాంతిని పోగొట్టుకున్నాడు. వారంలో చనిపోతానని తెలిసినప్పుడు చావును తప్పించుకునే మార్గాల్ని వెతుక్కోకుండా, జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి భాగవత శ్రవణం చేసిన పరీక్షిత్తు మనసు.. శాంతికి నిలయమై మోక్షమార్గాన్ని అందుకుంది. ధనం పట్ల తనకున్న మొహాన్ని వదులుకోవడం ద్వారా పింగళ అనే స్త్రీ; తనను అవమానించిన పరీక్షిత్తును క్షమించడం ద్వారా శమీకుడు శాంతిని పొందారు. ప్రహ్లాదుని భక్తి ముందు ఉగ్ర నరసింహుడు కూడా శాంతమూర్తి అయ్యాడు. శాంతి కోసం తపస్సు చేయనవసరం లేదు, కేవలం ఆలోచనా విధానాన్ని మార్చుకుంటే చాలని భాగవతాది గ్రంథాలు ప్రబోధించాయి. రాగ ద్వేష మోహాలు అశాంతికి మూలమన్నాడు బుద్ధుడు. అతి భోగం, కఠోర సాధన రెండిటినీ విడిచి మధ్యమ అష్టాంగ మార్గాన్ని అనుసరించాలని, అందరి పట్ల స్నేహన్ని, దీనుల పట్ల కరుణను చూపినప్పుడు మనసు ప్రశాంతమవుతుందని బోధించాడు. చెడు ఆలోచించకపోవడం, మాట్లాడకపోవడం, ఆచరించకపోవడం- అనే త్రికరణ శుద్ధియే శాంతికి మూలమన్నాడు మహావీరుడు. అవసరానికి మించి కూడబెట్టడం అశాంతికి గురి చేస్తుందని తెలియజేసింది జైనం. శాంతి కోసం ఇల్లు విడిచి కొండలకో కోనలకో వెళ్లాల్సిన పని లేదు. ఎక్కడికో పారిపోవాల్సిన అవసరం లేదు. కోరికలను తగ్గించుకొని, కోపాన్ని క్షమగా, భయాన్ని విశ్వాసంగా మార్చుకోవాలి. చేసే ప్రతి పనిని భగవదర్పణ భావనతో చేయగలగాలి. అప్పుడు ఒంట్లో, ఇంట్లో, సమాజంలో అంతటా శాంతి నెలకొంటుంది. శాంతి కోసం బయట వెతకకు, అశాంతికి కారణమైన వాటిని తొలగించుకుంటూ పోతే.. మనలో సహజంగా ఉన్న శాంతి బహిర్గతమ వుతుందన్నదే రుషి వాక్కు. .నెట్‌లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


