
ఇంటర్నెట్‌ డెస్క్: బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌ పేరు చెప్పగానే అందం, అభినయంతో పాటు ఆమె ఫిట్‌నెస్‌ గుర్తొస్తుంది. రెండు దశాబ్దాల నుంచి అగ్రహీరోలకు జోడీగా మెప్పిస్తూ.. ‘కే బ్యూటీ’ (Kay Beauty) బ్రాండ్‌తో వ్యాపారం రంగంలోనూ తనదైన స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఇంత గుర్తింపు సాధించిన ఆమె గురించి ఇప్పుడు సోషల్‌ మీడియాలో జరుగుతోన్న చర్చ మాత్రం విస్మయానికి గురిచేస్తోంది. ఇటీవల అంబానీ ఇంట జరిగిన వినాయక చవితి వేడుకల్లో భర్త విక్కీ కౌశల్‌తో కలిసి కత్రినా హాజరయ్యారు. ఆ ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. తల్లి అయ్యాక కత్రినా చాలా హుందాగా ఉన్నారంటూ కొందరు కామెంట్‌ చేయగా.. మరికొందరు మాత్రం ప్రసవానంతరం ఆమె శరీరాకృతిలో వచ్చిన మార్పులపై వ్యాఖ్యలు చేశారు. గతంలో ఉన్న ఫొటోలతో పోలుస్తూ ఆమె బరువు గురించి మాట్లాడుతున్నారు. ‘ఆమె పని అయిపోయింది.. వృద్ధాప్యం వచ్చేసింది’ అంటూ ట్రోల్స్‌ చేస్తున్నారు. దీంతో మహిళలు కత్రినాకు మద్దతుగా నిలుస్తున్నారు. 2025 నవంబర్‌లో కత్రినా బాబుకు జన్మనిచ్చారు. ఏడాది కూడా కాకముందే ఇలాంటి ట్రోల్స్‌ రావడంపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రసవం తర్వాత శరీరంలో మార్పులు సహజమే. ప్రతి మహిళ తిరిగి మునుపటి రూపంలోకి రావడానికి పట్టే సమయం ఒకేలా ఉండదు. అలాంటప్పుడు ఓ తల్లి శరీరాకృతిపై (Postpartum Weight) ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నిస్తున్నారు. ఒక మహిళను గౌరవించడంలో.. ఆమె రూపం మాత్రమే చూడకూడదని, ప్రతిభ, విజయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు. 2003లో ‘బూమ్’ చిత్రంతో కత్రినా కైఫ్ తన కెరీర్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించారు. ఆమె (Katrina Kaif) ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ.10 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటారని.. 2024 జీక్యూ ఇండియా నివేదిక వెల్లడించింది. ఇక మరోవైపు ఆమె బ్రాండ్‌ ‘కే బ్యూటీ’ 2025-2026 ఆర్థిక సంవత్సరంలో రూ.350 కోట్ల విలువైన అమ్మకాలను నమోదు చేసిందని అంచనా. ఆమె సాధించిన ఈ విజయాల గురించి మాట్లాడుకోకుండా బరువుపై విమర్శలు రావడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.