
దిల్లీ: ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కింద, ఒక ఏడాదిలో భారత్‌లో తయారైన 2.5 లక్షల కార్లను 8% సుంకంపైనే తమ మార్కెట్లోకి అనుమతించాలని ఐరోపా సమాఖ్య (ఈయూ) నిర్ణయించింది. ఈ కోటాను క్రమంగా 4 లక్షల కార్లకు పెంచనున్నట్లు ఈయూ విడుదల చేసిన ఒప్పంద ముసాయిదా వెల్లడించింది. మన దేశంలో తయారయ్యే సంప్రదాయ పెట్రో కార్లు, హైబ్రిడ్‌ విద్యుత్తు వాహనాలకు ఈ సుంకం రాయితీలు వర్తిస్తాయి. వాహనం ధర, బీమా, రవాణా ఖర్చులు కలిపి 50,000 యూరోల (సుమారు రూ.55.48 లక్షల) వరకు ధర ఉన్న కార్లకే ఈ రాయితీలు వర్తిస్తాయి. కోటా ఆధారిత రాయితీ సుంకాన్ని ఎఫ్‌టీఏ అమల్లోకి వచ్చిన రెండో ఏడాదిలో 6 శాతానికి తగ్గిస్తారు. మూడో ఏడాదిలో సుంకం 4 శాతానికి, నాలుగో ఏడాదిలో 2 శాతానికి తగ్గుతుంది. అయిదో ఏడాది నుంచి సుంకం పూర్తిగా సున్నాకు చేరుతుంది. దిల్లీ: ఐరోపా సమాఖ్యకు నిర్దిష్ట సుంకం- రేటు కోటా (టీఆర్‌క్యూ) కింద ఏడాదిలో మొత్తం 16.4 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశం మనదేశానికి లభించనుంది. ఇందులో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కింద 6,94,853 టన్నుల కోటా కేటాయించినట్లు ఐరోపా సమాఖ్య (ఈయూ) వెల్లడించింది. మొత్తం 16.4 లక్షల టన్నుల్లో మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌ (ఎంఎఫ్‌ఎన్‌) కింద 9.46 లక్షల టన్నులు, ఎఫ్‌టీఏ కింద 6.94 లక్షలు కేటాయించారు. నాన్‌-అలాయ్, అలాయ్‌ హాట్‌-రోల్డ్‌ షీట్లు/ స్ట్రిప్స్, కోల్డ్‌-రోల్డ్‌ షీట్లు, మెటాలిక్‌-కోటెడ్‌ షీట్లు, ఆర్గానిక్‌ కోటెడ్‌ షీట్లు, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ఉత్పత్తులు, టిన్‌ మిల్‌ ఉత్పత్తులు, రీబార్లు, వైర్‌ రాడ్లు, పైపులు, ట్యూబ్‌లకు ఈ కోటాలు వర్తిస్తాయి. ఉత్పత్తుల వారీగా: హాట్‌-రోల్డ్‌ షీట్లు, స్ట్రిప్‌ల కేటాయింపులు 5,09,605 టన్నులుగా ఉన్నాయి. ఇందులో ఎంఎఫ్‌ఎన్‌ కింద 2,99,197 టన్నులు, ఎఫ్‌టీఏ కింద 2,10,408 టన్నులు ఇచ్చారు. కోల్డ్‌-రోల్డ్‌ షీట్లకు 2,18,658 టన్నులు, మెటాలిక్‌-కోటెడ్‌ షీట్లకు 1,97,860 టన్నులు, ఆర్గానిక్‌-కోటెడ్‌ షీట్లకు 1,86,038 టన్నులు, క్వార్టో ప్లేట్‌లకు 1,81,835 టన్నులు, మెటాలిక్‌-కోటెడ్‌ షీట్లలో మరో విభాగానికి 85,157 టన్నులు, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ బార్లు, లైట్‌ సెక్షన్‌లకు 79,278 టన్నులు కేటాయించారు. ఈయూ ఉక్కు నిబంధనలు ఇలా..: ప్రస్తుతం భారత్‌ ఏటా 40 లక్షల టన్నుల ఉక్కును ఈయూకు ఎగుమతి చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో మిగులు ఉక్కు ఉత్పత్తి ప్రభావం నుంచి తమ దేశీయ పరిశ్రమను రక్షించుకునేందుకు ఈయూ జులై 1 నుంచి స్టీల్‌ ఓవర్‌ కెపాసిటీ రెగ్యులేషన్‌ను అమల్లోకి తెచ్చింది. దీని కింద ప్రపంచవ్యాప్తంగా మొత్తం డ్యూటీ-ఫ్రీ కోటాను 18.3 మి.టన్నులుగా నిర్ణయించారు. నిర్ణీత కోటా దాటి భారత్‌ నుంచి వెళ్లే ఉక్కు ఎగుమతులపై ప్రస్తుత బేస్‌-రేట్‌ సుంకాలతో పాటు 50% అదనపు సుంకం వర్తిస్తుంది. పారదర్శకత కోసం మెల్ట్‌-అండ్‌-పోర్‌ పద్ధతిని అమలు చేస్తారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





