
జూనియర్‌ ఆసియాకప్‌ హాకీలో అమ్మాయిల హ్యాట్రిక్‌ పురుషులకు నాలుగో టైటిల్‌ కప్పు గెలిచాక భారత మహిళల సెల్ఫీ జూనియర్‌ ఆసియాకప్‌ హాకీ టోర్నీలో భారత్‌కు తిరుగేలేదు. ఆరంభం నుంచి ఫైనల్‌ వరకు ఒకే జోరు ప్రదర్శించిన భారత పురుషుల, మహిళల జట్లు టైటిళ్లను నిలబెట్టుకున్నాయి. అమ్మాయిలు హ్యాట్రిక్‌ కొట్టగా.. అబ్బాయిలు నాలుగోసారి ట్రోఫీని సొంతం చేసుకున్నారు. ఈ గెలుపుతో వచ్చే ఏడాది జరిగే జూనియర్‌ హాకీ ప్రపంచకప్‌ బెర్తును కూడా భారత జట్లు కైవసం చేసుకున్నాయి. మోఖి (చైనా): జూనియర్‌ ఆసియాకప్‌లో భారత అమ్మాయిల జట్టు హ్యాట్రిక్‌ సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో 1-0తో ఆతిథ్య చైనాను ఓడించి వరుసగా మూడో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆరంభంలో దాడులు చేసిన చైనా.. భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. నెమ్మదిగా ఎదురుదాడులకు దిగిన భారత్‌.. గోల్‌ అవకాశాలను సృష్టించుకుంది. రెండో క్వార్టర్‌లో ప్రత్యర్థి గోల్‌కు సమీపంగా దూసుకొచ్చిన సనిక చంద్రకాంత్‌ (17వ నిమిషం) ఒక బలమైన షాట్‌తో బంతిని నెట్‌లోకి పంపింది. చైనా కీపర్‌ మెంగ్‌జియావో డైవ్‌ చేసినా.. బంతిని ఆపలేకపోయింది. ఆ తర్వాత చైనాకు ఓ పెనాల్టీకార్నర్‌ దక్కినా.. భారత డిఫెన్స్‌ ఆ ప్రయత్నాన్ని వమ్ము చేసింది. అర్ధభాగం ముగుస్తుందనగా భారత్‌కు మంచి గోల్‌ అవకాశం దక్కింది. కెప్టెన్‌ షిలైమా చాను కొట్టిన షాట్‌ను చైనా గోల్‌కీపర్‌ మెంగ్‌జియావో అడ్డుకుంది. మూడు, నాలుగు క్వార్టర్లలో గోల్‌ కొట్టి స్కోరు సమం చేయడానికి చైనా గట్టి ప్రయత్నమే చేసింది. కానీ ఫినిషింగ్‌ చేయలేకపోయింది. ఆఖరి నిమిషాల్లో చైనా దాడులను కాచుకున్న భారత్‌.. మ్యాచ్‌తో పాటు ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో భారత్‌ ఓటమి లేకుండా కప్‌ సాధించడం విశేషం. అబ్బాయిల ఆధిపత్యం: జూనియర్‌ ఆసియా కప్‌ హాకీ టోర్నమెంట్లో భారత పురుషుల జట్టు ఆధిపత్యాన్ని చాటుకుంది. వరుసగా నాలుగోసారి టోర్నీలో విజేతగా నిలిచింది. ఫైనల్లో అన్మోల్‌ బృందం 4-1తో కొరియాను ఓడించింది. మ్యాచ్‌ ఆరంభం నుంచి భారత్‌ జోరు ప్రదర్శించింది. అజీత్‌ యాదవ్‌ (9వ నిమిషం) గోల్‌తో ఆధిక్యంలోకి వెళ్లింది. సగం మ్యాచ్‌ పూర్తయ్యేసరికి స్కోరు 3-0గా మారింది. కెప్టెన్‌ అన్మోల్‌ (13వ) పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేయగా.. ప్రభ్‌దీప్‌ సింగ్‌ (21వ) ఓ సూపర్‌ ఫీల్డ్‌ గోల్‌ సాధించాడు. కొరియా కూడా దాడులు చేసింది. అయితే భారత డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. కొన్ని షాట్లు కొద్దిలో గోల్‌కు దూరంగా వెళ్లిపోయాయి. ఆఖరి క్వార్టర్‌లో అషు మౌర్య (50వ) గోల్‌తో భారత్‌ 4-0తో నిలిచింది. ఇదే స్కోరుతో భారత్‌ మ్యాచ్‌ను ముగిస్తుందనిపించింది. అయితే మరో ఆరు నిమిషాల్లో మ్యాచ్‌ పూర్తవుతుందనగా.. లీ మిన్‌హయాక్‌ గోల్‌ (54వ) చేయడంతో భారత్‌ ఆధిక్యాన్ని కొరియా కాస్త తగ్గించగలిగింది. ఆసియా కప్‌ను భారత్‌ ఆరోసారి గెలుచుకుంది. 2004, 2008, 2015, 2023, 2024 టోర్నీల్లోనూ జట్టు విజేతగా నిలిచింది. గత ఏడు కప్‌లలో భారతే ఆరు గెలిచింది. 2012లో మూడో స్థానాన్ని దక్కించుకుంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





