
రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈనాడు, విశాఖపట్నం: ఉత్తర అండమాన్, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ఆదివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి, సోమవారానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలోనే వాయుగుండంగా మారనుంది. మంగళవారానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. బుధవారం ఉదయానికి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య, దాన్ని ఆనుకొని ఉన్న వాయవ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఓ మోస్తరు వర్షాలు, బుధ, గురువారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. కోస్తాంధ్ర తీరం వెంట 50-60 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీయొచ్చు. సోమవారం అల్లూరి సీతారామరాజు, పోలవరం, నంద్యాల, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.