

- 22A భూములపై రేవంత్ లెక్కలు
- కోటి ఎకరాలు నిషేధిత జాబితా
- ధరణి అక్రమాలను ఎండగట్టిన సీఎం
CM Revanth Reddy: తెలంగాణలో భూములకు సంబంధించిన 22A నిషేధిత జాబితా అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ సున్నితమైన అంశంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రతిపక్షాలపై నేరుగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22A కింద నిషేధిత జాబితాలో ఉన్న భూములన్నీ గత బీఆర్ఎస్ పాలనలోనే చేర్చబడ్డాయని ఆయన స్పష్టం చేశారు. ధరణి పోర్టల్‌ను ఆసరాగా చేసుకుని బీఆర్ఎస్ నాయకులు, దళారులు కుమ్మక్కై వేల ఎకరాల విలువైన ప్రభుత్వ, ప్రైవేట్ భూములను కొల్లగొట్టారని సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
22A నిషేధిత భూముల సమగ్ర లెక్కలు:
శాసనసభ వేదికగా 22A పరిధిలోకి వచ్చే భూముల లెక్కలను రేవంత్ రెడ్డి సవివరంగా వెల్లడించారు. రాష్ట్రంలో 42,00,500 ఎకరాల అటవీ భూములు, 29,35,000 ఎకరాల శిఖం భూములతో పాటు పెద్ద ఎత్తున అసైన్డ్ భూములు కూడా ఈ జాబితాలో ఉన్నాయన్నారు. మొత్తం 93,31,000 ఎకరాల ప్రభుత్వ భూములతో కలిపి, దాదాపు కోటి 2 లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉందనేది వాస్తవమని సీఎం తేల్చి చెప్పారు.
ఒక్క ఇంచు భూమిని కూడా వదిలేదే లేదు:
ప్రభుత్వ ఆస్తులు, సహజ వనరుల రక్షణే తమ ధ్యేయమని తెలిపిన సీఎం, ఈ కోటి ఎకరాల భూమి నిషేధిత జాబితాలోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ భూములను జాబితా నుండి తొలగించే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదని చెప్పారు. మరోవైపు 3,73,903 ఎకరాలు ప్రైవేట్ భూముల జాబితాలో ఉన్నాయని, అలాంటప్పుడు తమ ప్రభుత్వంపై కబ్జా నిందలు వేయడం సముచితం కాదని మండిపడ్డారు.





