
ఏపీ 2025 మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన జగన్, పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించిందని మండిపడ్డారు. డీఎస్సీ అభ్యర్థుల కష్టానికి తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందాని ఆయన స్పష్టం చేశారు. పరీక్షల విశ్వసనీయతను దెబ్బతీస్తే యువత భవిష్యత్తు నాశనమవుతుందని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. "పరీక్షల విశ్వసనీయత పోయినప్పుడు, యువత కనే కలలకు రెక్కలు కత్తిరించినట్లే అవుతుంది" అని జగన్ తన పోస్టులో పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు సంవత్సరాల తరబడి రాత్రింబవళ్లు కష్టపడి చదువుతున్నారని ఆయన గుర్తుచేశారు. నిరుద్యోగులు మరియు వారి కుటుంబాలు ఎంతో శ్రమించి, కష్టపడి సంపాదించిన డబ్బును హెచ్చించి ఈ పరీక్షలకు హాజరవుతున్నారని జగన్ తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణలో లోపాలు రావడం అభ్యర్థుల కష్టాన్ని నీరుగార్చడమేనని విమర్శించారు. బాధితులకు న్యాయం చేయడం అనేది ఐచ్ఛికం కాదని, అది ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన ఈ డీఎస్సీ కుంభకోణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పూర్తిగా బాధ్యత వహించాలని జగన్ కోరారు. జూన్ నెల నుంచి కొనసాగుతున్న ఈ మెగా డీఎస్సీ వివాదంలో అనేక అంశాలపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటా కేటాయింపులు, మెరిట్ లిస్ట్ పారదర్శకత, సర్టిఫికేట్ వెరిఫికేషన్ విధానాలపై ఇప్పటికే అనేక విమర్శలు వచ్చాయి. డీఎస్సీ ప్రక్రియలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలనే డిమాండ్ కొనసాగుతోంది. పరీక్ష రాసిన అభ్యర్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని, తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు.





