
ఉస్మానియా యూనివర్సిటీ: పాతకక్షలను మనసులో ఉంచుకుని ఓ వ్యక్తిపై ప్రత్యర్థులు కత్తులతో విచక్షణారహితంగా గొంతు కోసి హత్య చేసిన ఘటన లాలాగుడా పోలీస్‌స్టేషన్ పరిధిలోని తుకారాంగేట్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తుకారాంగేట్‌కు చెందిన కార్తిక్ (40) నాలుగేళ్ల క్రితం తన ఇంటి ఎదురుగా ఉండే ఒక యువతి ప్రేమ పెళ్లికి సహకరించాడు. నాటి నుంచి ఆ యువతి కుటుంబ సభ్యులు కార్తిక్‌పై తీవ్ర కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి గణేష్ మండపం ఏర్పాటుకు సంబంధించి ఇరు వర్గాల మధ్య తీవ్రమైన వివాదం రేగింది. దీంతో ఆగ్రహానికి గురైన సదరు యువతి సోదరులు, బంధువులు కార్తిక్‌ను అడ్డుకుని కత్తులతో దాడికి తెగబడి ,అతని గొంతు కోసి హత్య చేశారు. ఘటన జరగడానికి ముందే గొడవపై స్థానికులు లాలాగుడా పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను కేవలం మందలించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు వెళ్లిన కాసేపటికే ప్రత్యర్థులు కార్తిక్‌పై కత్తులతో విరుచుకుపడ్డారు. తీవ్రరక్తస్రావమై రక్తపు మడుగులో పడివున్న బాధితుడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా, అతడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గొడవ సమయంలో పోలీసులు అక్కడే ఉండి ఉంటే ఈ హత్య జరిగేది కాదని, వారి నిర్లక్ష్యం వల్లే ప్రాణం పోయిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





