
NSE IPO | ఇంటర్నెట్‌ డెస్క్: దేశీయ మదుపర్లు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ పబ్లిక్‌ ఇష్యూ (NSE IPO) పట్టాలెక్కనుంది. సెప్టెంబరు 17న సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభమై.. 21వ తేదీన ముగియనుంది. షేర్ల ప్రైస్‌బ్యాండ్‌ రూ.1,700 నుంచి రూ.1,785గా కంపెనీ నిర్ణయించింది. ట్రేడింగ్‌ పరిమాణంలో ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్స్‌ ఎక్స్ఛేంజ్‌ అయిన ఎన్‌ఎస్‌ఈ.. పబ్లిక్‌ ఇష్యూకు దాదాపు దశాబ్దం కిందటే రావాల్సింది. కోలొకేషన్‌ వివాదం, పాలనాపరమైన ఆందోళనలు వంటి అవాంతరాలు దాటేందుకు ఇన్నేళ్లు పట్టింది. ఇంతకీ ఏమిటీ కోలొకేషన్‌ వివాదం? అసలేం జరిగింది? భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద టెక్నాలజీ ఆధారిత కుంభకోణాల్లో ఇది ఒకటి. కోలొకేషన్‌ సర్వర్ల వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకుని కొందరు బ్రోకర్లు అక్రమంగా రూ. వందల కోట్లు లాభాలు గడించారనేదే ఈ వివాదం. 2010 నుంచి 2014 మధ్య ఎన్‌ఎస్‌ఈలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఓ ప్రజావేగు ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు. స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చాలా వేగంగా జరుగుతుంది. సాధారణ పద్ధతిలో బ్రోకర్ల కంప్యూటర్లు ఎక్కడో దూరంగా వారి ఆఫీసుల్లో ఉంటాయి. వారు ఆర్డర్ పెట్టినప్పుడు, ఆ సమాచారం ఇంటర్నెట్ ద్వారా ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సర్వర్లకు చేరడానికి కొన్ని మిల్లీసెకన్ల సమయం పడుతుంది. కోలొకేషన్ పద్ధతిలో బ్రోకర్లు తమ సొంత కంప్యూటర్ సర్వర్లను నేరుగా ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సర్వర్లు ఉన్న భవనంలోనే ఏర్పాటు చేసుకున్నారు. దీనివల్ల డేటా ప్రయాణించే దూరం గణనీయంగా తగ్గి, వారికి మార్కెట్ ధరల సమాచారం ఇతరుల కంటే చాలా వేగంగా అందింది. దీంతో సాధారణ ట్రేడర్ల కంటే ముందే మార్కెట్ ధరల డేటా లభించడంతో పెద్ద మొత్తంలో లబ్ధి పొందారనేది ఆరోపణ. ఎన్‌ఎస్‌ఈలోని కొందరు సిబ్బందితో బ్రోకర్లు చేతులు కలిపారనేది వివాదం. దీంతో పాటు కొందరు బ్రోకర్లు మిగతా బ్రోకర్ల కంటే వేగంగా డేటాను బదిలీ చేసుకునేందుకు నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రత్యేక ప్రైవేట్ కమ్యూనికేషన్ లైన్ (డార్క్ ఫైబర్) సౌకర్యాన్ని పొందారనే మరో ఆరోపణ కూడా ఉంది. దశాబ్దం క్రితం అంటే 2016లో సెబీకి ఎన్‌ఎస్‌ఈ ముసాయిదా పత్రాలను సమర్పించింది. రూ.10,000 కోట్లు సమీకరించేందుకు ప్రతిపాదించింది. అప్పటికే కో-లొకేషన్‌ వ్యవహారం బయటకొచ్చింది. దీంతో ఐపీఓ ప్రయత్నాలకు బ్రేక్‌ పడింది. ఎలాంటి అనుభవమూ లేకపోయినా ఎన్‌ఎస్‌ఈలో సీఓఓగా నియమితులైన ఆనంద్ సుబ్రమణియన్ అదే ఏడాది వైదొలిగారు. అప్పట్లో ఎన్‌ఎస్‌ఈ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓగా ఉన్న చిత్రా రామకృష్ణ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఇదే కేసులో 2022లో ఆమెను సీబీఐ అరెస్ట్‌ చేసింది. కోలొకేషన్‌ వ్యవహారంలో రూ.625 కోట్లు జరిమానా చెల్లించాలని ఎన్‌ఎస్‌ఈని సెబీ ఆదేశించింది. దీనిపై సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (SAT)ను ఎన్‌ఎస్‌ఈ ఆశ్రయించడం, ఆపై వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో ఐపీఓ ప్రక్రియ ఏళ్లపాటు నిలిచిపోయింది. ఈ కుంభకోణం తర్వాతే ఎన్‌ఎస్‌ఈ కొన్ని మార్పులు చేసింది. డేటా అందరికీ ఒకే సమయంలో చేరేలా తన సాంకేతిక వ్యవస్థలో మార్పులు చేసింది. తమపై దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కోలొకేషన్, డార్క్‌ ఫైబర్‌ కేసులను పరిష్కరించుకునేందుకు ఈ ఏడాది మొదట్లో సెబీకి రూ.1,491.21 కోట్లు ఎన్‌ఎస్‌ఈ చెల్లించింది. ఆ తర్వాత ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు సెబీ నిరభ్యంతర పత్రం జారీ చేసింది. దీంతో పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ సాకారమవుతోంది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





