
అభివృద్ధి పనులపై రాజుకుంటున్న వివాదం భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం అభివృద్ధి నిర్మాణాల్లో రగడ రాజుకుంటున్నట్లు తెలిసింది. వైదిక పెద్దల సలహాలను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్మాణాలు చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు శతాబ్దాల క్రితం భక్త రామదాసు, ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత అవసరాల మేరకు పాత కట్టడాలను తొలగించి నూతన నిర్మాణాలు చేశారు. ఈసారి చేస్తున్న పని ఆలయ చరిత్రలోనే గొప్పది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి బృహత్తర ప్రణాళిక ద్వారా మూడు విడతలుగా రూ.586 కోట్లను వెచ్చించనుంది. ఇందులో మొదటి విడత నిర్మాణాలకు ఈ ఏడాది మార్చి 27న శ్రీరామ నవమికి ఇక్కడకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయగా రూ.276 కోట్లతో పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల్లో భూ స్పర్శ గురించి ప్రస్తావించడం ఆలోచించాల్సిన అంశంగా మారింది. రామాలయం దక్షిణం వైపున వరాహ, వేంకటేశ్వర, హయగ్రీవస్వామి వంటి ఉపాలయాలకు భూస్పర్శ లేకుండా నిర్మాణాలు చేస్తున్నారని వైదిక పెద్దలు శనివారం ఈఓ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఆదివారం ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఎమ్మెల్యే డా.తెల్లం వెంకట్రావు దృష్టికి తీసుకెళ్లారు. కొండకు ఆనుకుని ఆలయాలను నిర్మించాలనుకుంటే.. భూమి నుంచి కొండతో సమానంగా మట్టి, రాళ్లు వంటి వాటిని నింపాలి. తర్వాత భూ స్పర్శతో ఆలయాలను నిర్మించాలి. కొండకు వెలుపల భాగంలో కింది నుంచి రిటైనింగ్‌ వాల్‌ లాంటిది నిర్మించి (కింద సెల్లార్‌లాగా ఉంచి) దానిపై ఆలయాలను నిర్మించడం ఆగమశాస్త్ర విరుద్ధమని అంటున్నారు. పనులు మొదటి దశలోనే ఉన్నందున అవసరమైతే ప్రణాళికను సవరించి శాశ్వత రాతి ఆధ్యాత్మిక ఆలయాలను నిర్మించాలని కోరుతున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





