
ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రధాని నరేంద్ర మోదీని ఆయన చిన్ననాటి స్నేహితుడు (PM Modi schoolmate) అస్గర్‌అలీ వోహ్రా ఇటీవల కలిశారు. భాజపా ఎమ్మెల్యే నరేంద్ర మెహతాకు సంబంధించిన బిల్డర్లు నకిలీ పత్రాలను ఉపయోగించి తన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారని ఆయన మోదీతో చెప్పుకొని వాపోయారు. ఎన్నో దశాబ్దాలుగా తన భూమి కోసం పోరాటం చేస్తున్నా.. న్యాయం జరగకపోవడంతో ప్రధానిని ఆశ్రయించినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. వోహ్రా గుజరాత్‌లోని వడ్నగర్‌లోని బీఎన్ హైస్కూల్‌ (BN School)లో చదువుకునే సమయంలోనే మోదీ కూడా అదే పాఠశాలలో విద్యను అభ్యసించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని భయందర్ ఈస్ట్‌లోని నవ్‌ఘర్ రోడ్డులో ఉన్న సుమారు 2,810 చదరపు మీటర్ల భూమిని 1989లో వోహ్రా కొనుగోలు చేశారు. 2011లో కొందరు బిల్డర్లు నకిలీ పత్రాలు తయారు చేసి, తన భూమిని రెండు భాగాలుగా విభజించారు. అందులో ఒక భాగాన్ని బిల్డర్స్‌ తమ పేరు మీద బదిలీ చేయించుకోగా.. మరో భాగాన్ని సెవెన్ ఎలెవెన్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ పేరుకు చెందినదిగా నకిలీ పత్రాలు సృష్టించారు. ఆ సంస్థకు భాజపా ఎమ్మెల్యే నరేంద్ర మెహతాతో సంబంధం ఉంది. దీంతో ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. మున్సిపల్ కార్పొరేషన్, రెవెన్యూ శాఖ అధికారులు సైతం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. 2015లో ఎఫ్ఐఆర్ దాఖలు చేసినా దాదాపు 11ఏళ్ల తర్వాత తాజాగా (2026) లో ఈ కేసులో కోర్టుకు నివేదిక సమర్పించిందని అన్నారు. తీరా చూస్తే.. 2025లో నిందితులు తనపై ఎదురు కేసు పెట్టినట్లు తెలిసిందని వాపోయారు. దీంతో మరోదారి లేక తన చిన్ననాటి స్నేహితుడైన మోదీతో తన బాధను తెలియజేయడానికి ప్రధాని నివాసానికి వచ్చినట్లు తెలిపారు. రాజకీయ నేతల బెదిరింపుల వల్లే అధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకోవట్లేదని.. దీనిపై సీబీఐతో విచారణ జరిపించి, తనకు న్యాయం చేయాలని వోహ్రా మోదీని కోరారు. మోదీ ఆయనకు న్యాయం జరుగుతుందని ధైర్యం చెప్పారు. ఈ నేపథ్యంలో వోహ్రాకు సంబంధించిన భూవివాదంపై ఈనెల 16న కోర్టులో విచారణ జరగనుందని అధికారులు వెల్లడించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





