
TRAI on MNP Row | దిల్లీ: టెలికాం పరిశ్రమలో మరోసారి వివాదం నెలకొంది. తమ నెట్‌వర్క్‌కు మారేలా వొడాఫోన్‌ ఐడియా (VI) వినియోగదారులను ప్రోత్సహిస్తోందంటూ ప్రత్యర్థి కంపెనీలైన భారతీ ఎయిర్‌టెల్‌ ( Airtel ), జియో ( Jio ) ఆరోపిస్తున్నాయి. దీనిపై టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌( TRAI )కు ఫిర్యాదు చేశాయి. టెలికాం కంపెనీలు లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తామని ట్రాయ్‌ ఛైర్మన్‌ ఏకే లహోతీ పేర్కొన్నారు. నేరుగా కంపెనీల పేర్లు ప్రస్తావించకుండా టెల్కోల నుంచి వచ్చిన ఆందోళనలను పరిష్కరిస్తామని తెలిపారు. వొడాఫోన్‌ ఐడియా నెట్‌వర్క్‌కు మారేలా వినియోగదారులకు ఆ కంపెనీ ఎర వేస్తోందని ఎయిర్‌టెల్‌, జియో ఆరోపిస్తున్నాయి. వారి నెట్‌వర్క్‌లోకి పోర్ట్‌ అయ్యే వినియోగదారులకు ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తోందని పేర్కొంటున్నాయి. ఈ మేరకు ట్రాయ్‌కు రెండు కంపెనీలు ఫిర్యాదు చేశాయి. వినియోగదారులను ఆకట్టుకునేలా ప్రత్యేక టారిఫ్‌ ప్రయోజనాలు అందించడం నిబంధనలకు విరుద్ధమంటూ ట్రాయ్‌కి లేఖ రాశాయి. టారిఫ్ ప్రయోజనాలను తెలియజేసే ప్రకటనలు, ప్రమోషన్లను తక్షణమే ఉపసంహరించుకునేలా వొడాఫోన్‌ ఐడియాకు ఆదేశాలు ఇవ్వాలని కోరాయి. దీనిపై వొడాఫోన్‌ ఐడియాను పీటీఐ వార్తా సంస్థ వివరణ కోరగా.. తామెప్పుడూ ఆరోగ్యకరమైన పోటీని కోరుకుంటామని కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. ఉత్పత్తుల బలోపేతం, వినియోగదారులకు మెరుగైన సేవలందించడంపై తాము దృష్టిసారిస్తున్నామని పేర్కొన్నారు. చట్టానికి లోబడే తాము వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్నామని చెప్పారు. మరోవైపు, వొడాఫోన్‌ ఐడియా ఇటీవల తన లోగోలో మార్పులు చేసింది. బ్రాండ్‌ ప్రమోషన్‌ కోసం బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ను నియమించుకుంది. తద్వారా మార్కెట్‌లో మళ్లీ నిలదొక్కుకునే ప్రయత్నాలు మొదలుపెట్టిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.