
ప్రమాదంలో కుమార్తె దుర్మరణం పండగ వేళ ఆ ఇంట గుండెకోత న్యూస్‌టుడే, యాడికి గణపయ్య పండగకు ఇంటికొచ్చిన ముద్దుల కూతురుకు జ్వరం రావడంతో ఆ తండ్రి కంగారుపడ్డారు. ద్విచక్ర వాహనంపై కుమార్తెను తాడిపత్రిలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యం చేయించి ఇంటికి బయలుదేరారు. మరో అరగంటలో స్వగ్రామం చేరుతారనగా.. వెనుక కూర్చున్న అమ్మాయికి మగత కమ్మడంతో కింద పడింది. వెనుకనే వచ్చిన ఐచర్‌ వాహన చక్రం ఆమె తలపై వెళ్లడంతో ప్రాణాలు వదిలింది. నూరేళ్లు జీవించాల్సిన కూతురు కళ్లముందే విగతజీవిగా మారడంతో ఆ తండ్రి తల్లడిల్లిపోయారు. అయ్యో బిడ్డా ఎంత పని జరిగిందంటూ మృతదేహాన్ని ఒడిలోకి తీసుకొని రోదిస్తున్న తీరు చూపరులకు కన్నీరు తెప్పించింది. పెద్దవడుగూరు మండలం భీమునిపల్లెలో సంబరాలు నిండాల్సిన ఆ ఇంట తీరని విషాదం మిగిలింది. కంబగిరిరాముడు, రాజేశ్వరమ్మ దంపతులకు కుమార్తె వనజ (17), ఇద్దరు కుమారులు ఉన్నారు. తాడిపత్రిలోని కేజీబీవీలో వనజ ఇంటర్‌ ప్రథమ ఏడాది చదువుతోంది. వినాయక చవితికని రెండు రోజుల ముందే ఇంటికొచ్చి జ్వరం బారిన పడింది. తగ్గకపోవడంతో ఆదివారం తండ్రి కుమార్తెను తీసుకొని తాడిపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స చేయించి స్వగ్రామానికి బయలుదేరారు. పెండేకల్లు వద్ద జాతీయ రహదారిపై వాహనం వెనుక కూర్చున్న వనజ కళ్లు తిరిగి జారి కింద పడింది. ఐచర్‌ వాహనం ఆమె తలపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని వాహన డ్రైవరు సుమీత్‌ కశ్యప్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమ్తితం ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకున్న తల్లి, సోదరులు, బంధువులు రోదిస్తున్న తీరు అక్కడివారిని కలచివేసింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





