
మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే, ఈనాడు, కృష్ణా గూడూరు వద్ద ఆదివారం ఉదయం జోరున వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో కారు మబ్బులు కమ్మి వాన కురవడంతో విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎ ల్‌నినో ప్రభావంతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో రెండ్రోజులుగా కురిసిన వాన ఊరటనిచ్చింది. శనివారం కంటే ఆదివారం ఎక్కువ వర్షపాతం నమోదు కావడం, ఇంకొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ చెప్పడంతో అంతటా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పంటకు నీరు ఎలా అందించాలోనని ఆందోళన చెందిన అన్నదాతల్లో ఆశ చిగురించింది. జిల్లా వ్యాప్తంగా 3,38,571 ఎకరాల సాధారణ విస్తీర్ణం ఉండగా ఇప్పటి వరకు 2,82,831 ఎకరాల్లో సాగు చేశారు. గూడూరు మండలంలో 18,048 ఎకరాలకు గానూ 17,657 ఎకరాల్లో సాగయ్యింది. జిల్లాలో అత్యధికంగా 98 శాతం సాగు ఇదే. జిల్లాలో ఆరు మండలాల్లో 90 శాతానికిపైగా, మిగిలిన మండలాల్లో 71 శాతం నుంచి 90 శాతం వరకు సాగైనట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. నాగాయలంక మండలంలో నిర్దేశించిన లక్ష్యానికి మించి సాగు కావడం గమనార్హం. ఇక్కడ 1,164 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేయగా 3,038 ఎకరాల్లో సాగు చేశారు. పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, గుడ్లవల్లేరు, బందరు ఇలా వివిధ మండలాల్లో ఎక్కువ శాతం వెదసాగు చేపట్టారు. శివారు ప్రాంతాల్లో పొలాలు ఎండి పోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా కురిసిన వానలతో పొలంలో తేమ శాతం కొన్ని రోజుల వరకు ఉంటుందని అన్నదాతలు చెబుతున్నారు. జిల్లాలో 831.2 మిల్లీమీటర్ల వర్షం జి ల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయానికి 831.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 32 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఖరీఫ్‌ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఇదే అత్యధికం. పెనమలూరులో అత్యధికంగా 100.2 మిల్లీమీటర్లు కురవగా కోడూరు మండలంలో అత్యల్పంగా 4.4 మి.మీ పడింది. కృత్తివెన్ను 72.6, నందివాడ 65.4, ఉంగుటూరు 64.4, కంకిపాడు 64.2, గుడివాడ 51.4, పమిడిముక్కల 37.4, గన్నవరం 34.4, గుడ్లవల్లేరు 32.8, చల్లపల్లి 32.2, పెదపారుపూడి 31.6, బంటుమిల్లి 29.6, మచిలీపట్నం నార్త్, సౌత్‌ 25.6, ఉయ్యూరు 24.6, పెడన 22.4, తోట్లవల్లూరు 22.4, పామర్రు 18.4, ఘంటసాల 17.8, మొవ్వ 15.6, గూడూరు 12.2, నాగాయలంక 8.2, బాపులపాడు 6.6, మోపిదేవి 6.4, అవనిగడ్డ మండలంలో 4.8 మి.మీ వర్షం కురిసింది. మచిలీపట్నం బస్టాండ్‌తోపాటు వివిధ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





