
వైకాపా నేత బినామీ చేతికే పూర్ణమార్కెట్‌ నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ఆశీల వసూళ్లు నోటీసులిచ్చి కళ్లు మూసుకున్న అధికారులు ఈనాడు, విశాఖపట్నం: కూటమి పాలనలోనూ వైకాపా నాయకుడి హవా నడుస్తోంది. గతేడాది కంటే రూ.36లక్షలకు తక్కువగా పూర్ణమార్కెట్‌ ఆశీలు వసూలు బాధ్యత ఆ నేత బినామీకి కట్టబెట్టారు.నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ధరలు పెంచి ఆశీలు వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటీవల ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండటంతో చివరికి నోటీసులిచ్చి చేతులు దులుపుకొన్నారు. పూర్ణమార్కెట్‌ ఆశీలు వేలం సమయంలోనే వైకాపా నాయకుడి కుటుంబం చక్రం తిప్పింది. అతని బినామీ మినహా ఎవరూ వేలంలో పాల్గొనకుండా బెదిరించి కేవలం రూ.84లక్షలకే(జీఎస్టీతో కలిపి) దక్కించుకున్నారు. 2025లో ఈ వేలం రూ.1.20కోట్లకు వెళ్లింది. సాధారణంగా అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే తక్కువకు గుత్తేదారు వేలం పాటలో దక్కించుకుంటే, దాన్ని రద్దు చేసి మళ్లీ వేలం వేయొచ్చు. కానీ ఇక్కడ అలా చేయకుండా ఆ నాయకుడు కొందరు స్థానిక కూటమి నాయకుల అండదండలు ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వైకాపా నేత భీమిలి నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా వెళ్లేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పూర్ణమార్కెట్‌లో గెజిట్‌ ప్రకారం కాకుండా సదరు నేత నిర్ణయించిన ప్రకారం ఆశీలు వసూలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనానికి రూ.5, కారుకు రూ.10 బదులు రూ.30 రసీదులు ముద్రించి మరీ వసూలు చేస్తున్నారు. మార్కెట్‌ లోపల దుకాణాలు కాకుండా బయట జంగిడి వ్యాపారాలు చేసుకునేవారి నుంచి రూ.50 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మార్కెట్‌కు లోడు తీసుకొచ్చే ఒక్కో వాహనం నుంచి రూ.70 తీసుకోవాల్సి ఉండగా, రూ.200 నుంచి రూ.250 వరకు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులందాయి. ఈ గుత్తేదారు ఇందిర ప్రియదర్శిని స్టేడియం వెనుక ఉన్న చేపల మార్కెట్‌లోనూ ఆశీలు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే మూడు నోటీసులు: ఆశీల ధరలు పెంచి వసూలు చేయడం, గెజిట్‌ నిబంధనలు పాటించకపోవడంపై జీవీఎంసీ అధికారులు ఇప్పటికే గుత్తేదారుకు మూడు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ధరలు అందరికీ కనిపించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించినా గుత్తేదారు పట్టించుకోవడం లేదు. రాజకీయ ఒత్తిళ్లు ఉండటంతో అధికారులు సైతం గట్టిగా చర్యలు తీసుకోకుండా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





