
డోర్నకల్ , సెప్టెంబర్ 16 : గిరిజనుల ఆరాధ్యుడు కేసీఆర్ అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. బుధవారం ఆమె మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ముల్కలపల్లిలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా జీవో 33 ద్వారా గిరిజనులకు కేసీఆర్ 6 శాతం నుంచి 10 శాతం వరకు రిజర్వేషన్ పెంచి నాలుగేండ్లు పూర్తయిందని అన్నారు. రిజర్వేషన్‌తో గిరిజనుల బిడ్డలు ఉద్యోగాలు, పదోన్నతులు పొందినట్టు చెప్పారు. నాలుగేండ్ల క్రితం సెప్టెంబర్ 17న కేసీఆర్ రిజర్వేషన్ ప్రకటించారని, అదే నెల 30న అమల్లోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో గిరిజనుల స్థితిగతులు చూసి మొదటి అసెంబ్లీ సమావేశంలోనే వారికి రిజర్వేషన్లు తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. గిరిజనులు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయాలని పిలుపు నిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం గిరిజనులకు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. రెండున్నరేండ్లలో గిరిజన సంక్షేమానికి ఒక్క పైసా ఖర్చు చేయలేదని ఆరోపించారు. గిరిజనుల సబ్‌ప్లాన్ నిధులకు కోత పెట్టినట్టు దుయ్యబట్టారు.




