
ఈనాడు, విశాఖపట్నం: దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతోపాటు కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో ఈ నెల 19న బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్‌ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తదుపరి మూడు, నాలుగు రోజులలో పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ బలపడి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశముంది. ఈ ప్రభావంతో వచ్చే వారంలో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశముంది. బుధవారం కాకినాడ జిల్లా రౌతులపూడిలో 68.6, అనకాపల్లి జిల్లా మర్రిపాలెంలో 54, కాకినాడ జిల్లా డి.పోలవరంలో 48.5, కోనపాపపేటలో 46.8, విశాఖ జిల్లా అక్కిరెడ్డిపాలెంలో 45.5 మి.మీ. వర్షం కురిసింది. గురువారం అల్లూరి సీతారామరాజు, పోలవరం, కృష్ణా, గుంటూరు, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




