
ఈనాడు, అమరావతి: పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్ల (వీఏఎస్‌) నియామక ప్రక్రియ విధివిధానాలపై ఆ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. 60% మార్కులకు ఏపీపీఎస్సీ ద్వారా పరీక్ష నిర్వహించడం, మిగిలిన 40% మార్కులకు పాత పద్ధతిలో సీనియారిటీ, సర్వీస్‌ వెయిటేజీ ఇవ్వడమనే ప్రతిపాదన వారి పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. దీనిపై ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకోగానే అధికారిక ఉత్తర్వులు వస్తాయి. ఈ నియామక ప్రక్రియపై గురువారం లేదా శుక్రవారం స్పష్టత రానుంది. కొన్నేళ్లుగా పరీక్ష లేకుండా మెరిట్, సర్వీస్‌ ఆధారిత వెయిటేజీ విధానంలో పశుసంవర్ధక శాఖ ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో నియామకాలు చేపడుతున్నారు. ఈసారి అలా కాకుండా ఏపీపీఎస్సీ ద్వారా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. ఆ మేరకు నియామక ప్రక్రియను ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ ఈ నెల 13న జీఓ జారీ చేసింది. ఎనిమిదేళ్ల నుంచి నియామకాలు చేపట్టలేదు కాబట్టి ఇప్పుడు నియామకాలను గతంలో ఉన్నట్లే పాత పద్ధతిలో చేపట్టాలని, లేకపోతే తాము నష్టపోతామని నిరుద్యోగ వెటర్నరీ గ్రాడ్యుయేట్లు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లలో సీనియర్లు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో తిరిగి పాత పద్ధతిలో పశుసంవర్ధకశాఖ ఎంపిక కమిటీ ద్వారానే నియామకాలు చేపడతామని పశుసంవర్ధకశాఖ ఈ నెల 14న మరో జీఓ జారీ చేసింది. పరీక్ష లేకపోతే తమలాంటి కొత్తవారికి ఇబ్బంది వస్తుందని ఇటీవలే బీవీఎస్సీ, ఎంవీఎస్సీ పూర్తిచేసుకున్న నిరుద్యోగ ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ పరిస్థితుల్లో ఏ వర్గానికీ నష్టం జరకుండా నియామక ప్రక్రియ ఎలా చేపట్టవచ్చనే దానిపై పశుసంవర్ధకశాఖ అధికారులు ఈ కసరత్తు చేస్తున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




