
Odela | ఓదెల, సెప్టెంబర్ 13 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను ఆదివారం ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పొత్కపల్లి ఎస్సై సనత్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు రసాయన పదార్థాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలను కాకుండా మట్టి విగ్రహాలనే పూజిద్దామని పేర్కొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో కలిగే అనర్థాలను వివరించారు. ఇంటింటా, వాడ, వాడలా మట్టి గణపతులను వినియోగించాలని ప్రజలను చైతన్య పరుస్తున్న సదాశయ ఫౌండేషన్ సభ్యులను అభినందించారు. మట్టితో చేసిన విగ్రహాలైతే నిమజ్జనం సందర్భంగా త్వరగా నీటిలో కలిసిపోతాయి అన్నారు. వాగులు, చెరువులు, కుంటలు కలుషితం కాకుండా స్వచ్ఛంగా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి మెరుగు భీష్మాచారి, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, ఫౌండేషన్ సభ్యులు ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, క్యాతం వెంకటేశ్వర్లు, మెరుగు సారంగం, క్యాతం మల్లేశం, అల్లం సతీష్, వేణు తదితరులు పాల్గొన్నారు.






