
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది.గత వారం వరకు రాష్ట్రంలో వర్షాలు కురవగా.. ప్రస్తుతం భానుడు భగ్గమంటున్నాడు. అయితే రాష్ట్రంలో వర్షాల విరామానికి బ్రేక్ పడిందని.. మళ్లీ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఇవాళ చాలాప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగినప్పటికీ.. రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మళ్లీ జోరుగా వానలు కురిసే పరిస్థితులు ఉన్నాయని వాతావరణ విశ్లేషణలు వెల్లడించారు. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఏర్పడుతున్న అల్పపీడన ప్రాంతం ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ సైతం వెల్లడించారు. దీని ప్రభావంతో రాత్రి వేళ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అయితే ఈ వర్షాల తీవ్రత అన్ని జిల్లాల్లో ఒకేలా ఉండదని, ప్రాంతాల వారీగా వ్యత్యాసం ఉంటుందని అంచనా వేశారు. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, జనగామ, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు విస్తృతంగా మోస్తరు నుంచి తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇప్పటికే వర్షాకాల పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో రాత్రి వేళ కురిసే వర్షాలు ఒక్కసారిగా తీవ్రత పెంచే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, గ్రామీణ రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున స్థానికులు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని చెప్పారు.రాజధాని హైదరాబాద్లో పగటి పూట పొడి వాతావరణమే ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు అక్కడక్కడా వర్షపు జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఒకేసారి వర్షం పడే పరిస్థితి కాకుండా విడతలవారీగా, ప్రాంతాల వారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీంతో రాత్రి ప్రయాణాలు చేసే వారు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ముందుకు సాగడం మంచిదని సూచిస్తున్నారు. వర్షాలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడా గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆగస్టు 12 నుంచి 14 వరకు ఉరుములు, మెరుపులు, బలమైన గాలులకు సంబంధించి హెచ్చరికలు కొనసాగుతున్నాయి.వర్షం కురిసే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఆగస్టు నెలలో సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని గతంలో ఐఎండీ అంచనా వేసింది. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలవారీగా వర్షాల తీవ్రతలో మార్పులు ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.




