
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకొని నకిలీ కాల్‌సెంటర్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న వ్యవస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝళిపించింది. హైదరాబాద్ జోనల్ కార్యాలయానికి చెందిన ఈడీ అధికారులు ఈనెల 15న మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద పటియాలా, పుణె, చండీగఢ్‌లోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా, 3 నకిలీ కాల్‌సెంటర్లు ఉన్నట్టు గుర్తించారు. వీటిలో పటియాలాలో రెండు, పుణెలో ఒకటి ఉన్న ట్టు తేల్చిన అధికారులు ఆయా ప్రాంతా ల్లో తాజాగా సోదాలు చేపట్టారు. వీటిల్లో సుమా రు 220 మంది పనిచేస్తున్నట్టు గుర్తించారు. సోదాల సందర్భంగా 66 మొబైల్ ఫోన్లు, 13 ల్యాప్‌టాప్‌లు, హార్డ్డిస్లు, ఇతర కమ్యూనికేషన్ పరికరాలు, నగదు, పలు రికార్డులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. ఆయా డిజిటల్ ఆధారాలను లోతుగా విశ్లేషిస్తున్నారు. కాల్ క్యాంపెయిన్లు, స్రిప్టులు, డయలర్, బాధితుల డాటా, చెల్లింపు మార్గా లు, కాల్‌సెంటర్ల నిర్వాహకుల వివరాలు, మోసాల ద్వారా వచ్చిన నగదు ప్రవాహంపై దర్యాప్తు కొనసాగుతున్నదని ఈడీ తెలిపింది.





