
ముత్తారం, సెప్టెంబర్ 16: ఎన్నికల్లో సహకరించని వారిపట్ల కాంగ్రెస్ నాయకుల కక్ష సాధింపు చర్యలు పరాకాష్టకు చేరుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఇప్పలపల్లిలో ఇద్దరు దివ్యాంగుల పింఛన్‌ను సర్పంచ్ తొలగించగా, బాధితులు ఎంపీడీవో ఆఫీస్ భవనం ఎక్కి ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ఇప్పలపల్లికి చెందిన దివ్యాంగులు సూరం రాజబాబు, పెద్దపల్లి సత్తయ్య కొన్నేండ్లుగా పింఛన్‌పైనే ఆధారపడి జీవిస్తున్నారు. మూడు నెలలుగా పింఛన్ నిలిచిపోవడంతో ఏమైంది సారూ అని అడిగితే అడిగితే ‘మీ ఊరి సర్పంచ్ తాని ప్రభాకర్ కంప్లయింట్ ఇవ్వడంతోనే పింఛన్ నిలిచిపోయిందని, మా చేతుల్లో ఏమీ లేదని’ అధికారులు చెప్పడంతో కంగుతిన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయ భవనం పైకి ఎకి వెంట తెచ్చుకున్న పురుగులమందు డబ్బాతో ఆత్మహత్యకు యత్నించగా, గ్రామస్తులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించి.. పింఛన్లు తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యాలయ సూపరింటెండెంట్ సురేశ్ అక్కడికి రావడంతో బాధితులు ఏడ్చుకుంటూ ఆయన కాళ్లు మొకిన తీరు పలువురిని కలచివేసింది. పింఛన్లు పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని సురేశ్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రాజకీయ కక్షతోనే తొలగింపు నాకు ఒక చెవి పూర్తిగా లేదు. మూడు నెలల నుంచి పింఛన్ వస్తలేదు. అధికారులను కలిస్తే మీ సర్పంచ్ ఫిర్యాదు చేసిండు అని అంటున్నరు. రామగుండం పోయి డాక్టర్లను కలిసి మరో సర్టిఫికెట్ తెచ్చుకోవాలని అంటే పోయిన. వాళ్లు పరీక్షించి సదరం సర్టిఫికెట్ ఉంది కదా, మరే సర్టిఫికెట్ ఇవ్వలేం.. హైదరాబాద్ వెళ్లాలని చెప్పిన్రు. చెవిటితో ఇబ్బంది పడుతున్న నేను ఎకడికని తిరుగుత. వెంటనే నా పింఛన్ పునరుద్ధరించాలి. – సూరం రాజబాబు, దివ్యాంగుడు వైఎస్ ఇస్తే ..రేవంత్ ప్రభుత్వంలో పోయింది నాకు సరిగ్గా నడువరాదు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రూ.500 పింఛన్ ఇచ్చిండు. కేసీఆర్ సర్ వచ్చాక రూ.4వేలకు పెంచిండు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో పనిచేస్తున్న సర్పంచ్ నా పింఛన్ బంద్ పెట్టించిండు. నాకు పింఛన్ డబ్బులే జీవనాధారం. అందరికీ దండం పెడుతున్న. నాకు పింఛన్ ఇప్పియండి. లేకుంటే నా జీవితమే దండుగ. – పెద్దపల్లి సత్తయ్య, దివ్యాంగుడు



