
– ఈ నెల 30 వరకు ప్రవేశాలు – మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధికి WE HUBతో ప్రత్యేక కార్యక్రమాలు – యూనివర్సిటీ జెడి డాక్టర్ బి.ధర్మ నాయక్ రామగిరి, సెప్టెంబర్ 15 : విద్యను అందరికీ చేరువ చేయడంతో పాటు విద్యార్థుల్లో నైపుణ్యాలు, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బిఆర్ఏఓయూ) ఆధునిక అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులు, విద్యా విధానాలను అమలు చేస్తోందని, ఆ యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్, ఎడ్యుకేషన్ ఎక్స్టెన్షన్ సెంటర్ నోడల్ అధికారి డాక్టర్ బి. ధర్మ నాయక్ తెలిపారు. నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం అధ్యయన కేంద్రం కౌన్సిలర్ల సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ధర్మ నాయక్ మాట్లాడారు. 2026 విద్యా సంవత్సరానికి యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నాయని, అర్హులు సెప్టెంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వైస్ ఛాన్సలర్ గంటా చక్రపాణి ఆధ్వర్యంలో మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన కోర్సులను రూపొందిస్తున్నట్లు తెలిపారు. డిప్లొమా, సర్టిఫికెట్, నైపుణ్యాధారిత కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నామని, సాంకేతికత ద్వారా గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్యను మరింత అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. మహిళా విద్యార్థుల్లో వ్యాపార ఆలోచనలను ప్రోత్సహించేందుకు బిఆర్ఏఓయూ–WE HUB సంయుక్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ధర్మ నాయక్ తెలిపారు. “మీ ఆలోచనను వ్యాపారంగా మార్చండి.. మేము మీకు సహాయం చేస్తాము” అనే నినాదంతో వ్యాపారాభివృద్ధి, ఆవిష్కరణలు, నైపుణ్య శిక్షణ, మార్గదర్శకత్వం అందించనున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు టీసీఎస్, ఐకాన్, రామానంద తీర్థ ఇనిస్టిట్యూట్, రాశి, వి-హబ్ తదితర సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది నల్లగొండ జిల్లా నుంచి అధిక సంఖ్యలో ప్రవేశాలు ఉంటాయని, ఈ ఏడాది కూడా రాష్ట్రంలో నల్లగొండను మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కే. శ్రీనివాసరాజు, రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ అనిల్ బొజ్జ, కో-ఆర్డినేటర్ డాక్టర్ భూక్యా వీరన్న, డాక్టర్ సుంకరి రాజారామ్, అధ్యయన కేంద్రాల కౌన్సిలర్లు పాల్గొన్నారు.





