
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సైఫాబాద్ పోలీస్ స్టేషన్లోకి ఏకంగా 15 మంది ముసుగు ధరించిన గుండాలు అక్రమంగా చొరబడి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో మహేశ్, పీఏ మహేందర్ రెడ్డిపై మూకుమ్మడిగా దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షతో పెట్టిన పోలీసు కేసు విచారణ కోసం పోలీస్ స్టేషన్కు పిలిపించి, ఖాకీల సమక్షంలోనే వారిపై హింసకు పాల్పడడం వెనుక పెద్ద కుట్ర ఉందని అన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో పోలీసులు, శాంతిభద్రతల వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఈ ఘటనతో రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఎవరిపై పడితే వారిపై దాడులు చేయిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. హైకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మహేష్, మహేందర్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, కక్షసాధింపులో భాగంగానే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని తెలిపారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాజకీయ జోక్యానికి తావులేకుండా సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాలన్నారు. గుండాల దాడిలో గాయపడిన పీఆర్వో మహేశ్, పీఏ మహేందర్ రెడ్డికి వెంటనే పూర్తి భద్రత కల్పించి, మెరుగైన వైద్య చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా తన పోరాటాన్ని ఉధృతం చేస్తుందని స్పష్టం చేశారు.



