
ఒకప్పుడు అన్నదానం మహాదానం అనేవారు.. కానీ ప్రస్తుత సమయంలో అవయవ దానం మహాదానంగా మారింది. ఏదో ఒక అవయవం చెడిపోయి.. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వారికి.. ఆ అవయవాన్ని ఎవరైనా చనిపోయిన వారిది దానం చేస్తే.. ఒక ప్రాణం నిలబడుతుందని.. ఎంత చెప్పినా, ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా.. అది మాత్రం పూర్తిస్థాయిలో ఆచరణలోకి రావడం లేదు. కావాల్సిన సమయానికి అవయవం అందక.. చనిపోతున్న వారి లెక్కలు చూస్తే గుండె తరుక్కుపోతోంది. తెలంగాణలో అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రోగుల పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది.రాష్ట్రంలో 2013 నుంచి 2026 వరకు జీవదాన్ కార్యక్రమం కింద అవయవ మార్పిడి కోసం నమోదు చేసుకున్న 19,386 మంది రోగుల్లో కనీసం 4,106 మంది అవయవం కోసం ఎదురుచూస్తూనే మరణించారని లెక్కలు చెబుతున్నాయి. అంటే దాదాపు ప్రతి ఐదుగురు రోగుల్లో ఒకరు అవయవం అందక ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక జీవదాన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. ఈ కాలంలో 5,307 మందికి విజయవంతంగా అవయవ మార్పిడి జరిగింది. అయితే మరో 9,413 మంది ప్రస్తుతం వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. దీంతో అవయవ దానానికి, మార్పిడి అవసరాలకు మధ్య ఉన్న భారీ అంతరం మరోసారి స్పష్టమవుతోంది.తెలంగాణలో ఏడాదికి సుమారు 7500-8000 అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నప్పటికీ.. వార్షిక అవయవ దానాల సంఖ్య మాత్రం వెయ్యిలోపే ఉండటం గమనార్హం. 2025లో అత్యధికంగా 763 అవయవ దానాలు నమోదు అయ్యాయి. అవయవం కోసం ఎదురుచూస్తూ మరణించిన వారిలో ప్రధానంగా ఐదు అవయవాల కోసం ఎదురుచూసినవారే ఎక్కువగా ఉన్నారని ఆ లెక్కలు చెబుతున్నాయి. కాలేయం కోసం 2,240 మంది.. కిడ్నీ కోసం 1,537 మంది.. ఊపిరితిత్తులు కోసం 229 మంది.. గుండె కోసం 96 మంది.. ప్యాంక్రియాస్ కోసం 4 మంది ఎదురుచూస్తున్నారు. 2013-2026 మధ్య జీవదాన్ కార్యక్రమానికి 1,724 కిడ్నీలు.. 1,724 కాలేయాలు.. 506 ఊపిరితిత్తులు.. 258 గుండెలు దానంగా అందినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి.అవయవ దానాలు అవసరానికి తగ్గ స్థాయిలో లేకపోవడానికి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల భాగస్వామ్యం తక్కువగా ఉండటం ప్రధాన కారణాల్లో ఒకటని జీవదాన్ అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం జీవదాన్ కార్యక్రమంలో 4 ప్రభుత్వ ఆస్పత్రులు.. 37 కార్పొరేట్ ఆస్పత్రులు నమోదై ఉన్నట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడినవారిలో బ్రెయిన్‌డెడ్ కేసులు అవయవ దానానికి కీలక వనరుగా మారే అవకాశం ఉంది. అయితే నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో ఇందుకోసం అవసరమైన వసతులు ఉన్నప్పటికీ.. అక్కడి నుంచి అవయవ దానాలు తక్కువగా ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.ట్రైనింగ్ తీసుకున్న సిబ్బంది తక్కువగా ఉండటం, అవయవదానం విషయంలో న్యాయపరమైన అంశాలపై ఆందోళనలు, కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ అందించే బృందాలు లేకపోవడం వంటి కారణాలతో కొన్ని బ్రెయిన్‌డెడ్ కేసులు గుర్తింపు దశలోనే నిలిచిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించిన ప్రమాద బాధితుడి కుటుంబాన్ని అవయవ దానానికి ఒప్పించడం కూడా పెద్ద సవాలుగా మారుతోందని వారు పేర్కొన్నారు.అవయవ దానంపై అవగాహనను కేవలం సాధారణ ప్రచారానికి పరిమితం చేయకుండా స్కూళ్లు, కాలేజీలు, మత సంస్థలు, సామాజిక సంఘాలు, ఎన్జీవోలు, కమ్యూనిటీ నాయకులను భాగస్వాములను చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఒక అవయవ దాత పలువురి ప్రాణాలను కాపాడగలడనే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు. అవగాహన కార్యక్రమాలకు సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించాలని సూచిస్తున్నారు. ఆగస్ట్ 13వ తేదీన ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఈ గణాంకాలు.. అవయవ దానం ఎంత కీలకమో, దాతల కొరత కారణంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో స్పష్టం చేస్తున్నాయి.





