
హైదరాబాద్ మెట్రో విస్తరణలో కీలకమైన పాతబస్తీ కారిడార్ పనుల్లో కదలిక వచ్చింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ప్రతిపాదించిన 7.5 కిలోమీటర్ల మెట్రో మార్గం పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సంబంధిత అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఉన్నతాధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో పాతబస్తీ మెట్రోతో పాటు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మేర నిర్మించనున్న మెట్రో కారిడార్‌కు సంబంధించిన పనులను త్వరితగతిన ముందుకు తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ మార్గంలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయడంతో పాటు మెట్రో నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు విస్తరణ, భూసేకరణ, టెండర్ల ప్రక్రియలను సమన్వయం చేసుకుంటూ పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా ముందుకు వెళ్లాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.పాతబస్తీ ప్రాంతానికి మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే అక్కడి ప్రజలకు ప్రజా రవాణా మరింత సులభతరం కావడంతో పాటు నగరంలోని ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కూడా ఉపయోగపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పాతబస్తీ కారిడార్ నిర్మాణంలో ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇందుకోసం ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులను సంప్రదించి అవసరమైన సాంకేతిక సలహాలు, సూచనలు తీసుకోవాలని ఆదేశించారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడంతో పాటు నిర్మాణం, నిర్వహణ, ప్రయాణికుల సౌకర్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.మరోవైపు.. హైదరాబాద్ మెట్రో రైళ్లలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రస్తుతం ఉన్న రైళ్ల సామర్థ్యానికి అదనంగా కొత్త కోచ్‌లను కొనుగోలు చేసి.. వాటిని మెట్రో రైళ్లకు జత చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. పీక్ అవర్స్‌లో ప్రయాణికుల రద్దీని తగ్గించడంతో పాటు మెట్రో సేవల సామర్థ్యాన్ని పెంచేందుకు అదనపు కోచ్‌లు కీలకంగా మారనున్నాయి. నగరంలో మెట్రోకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుగానే చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Recommended for you
Found this helpful?
Share this story with your network









