
నల్లగొండ : నాగార్జున సాగర్ ( Nagarjuna Sagar) ఆయకట్టు కింద వెంటనే నీటి విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ( Jagadish Reddy ) డిమాండ్ చేశారు. ఇందుకుగాను నీటి విడుదల షెడ్యూల్ ను ప్రకటించాలని కోరారు. నల్గగొండలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగర్ ఎడమ కాల్వకు షెడ్యూల్ ప్రకటించకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) పాదయాత్ర చేస్తారని స్పష్టం చేశారు. రైతులు సాగర్ ఆయకట్టు కింద పూర్తి స్థాయిలో మొత్తం నాట్లు వేయాలని, నీళ్ల కోసం తామంతా పోరాటాలు చేస్తామని వెల్లడించారు. మొత్తం ఆయకట్టుకు ప్రభుత్వం నీళ్లు ఇవ్వాల్సిందేనని అన్నారు. నీళ్లు ఇవ్వకపోతే ప్రభుత్వ అంతు చూస్తామని హెచ్చరించారు. రైతులు బాధలు పడుతుంటే ముఖ్యమంత్రి పైశాచికనందం పొందుతున్నారని విమర్శించారు. మంత్రులకు సోయి లేదని, ఇకపై బడిత పూజ చేయాల్సిందేనని అన్నారు. ఆంధ్ర నీటి దోపిడీపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీ ( KRMB) కి లేఖ కూడా రాయలేదన్నారు. భూ భారతి పేరుతో భూములను కొల్లగొడుతున్నారని, ముఖ్యమంత్రి మంత్రులు అందరూ దోచుకునే పనిలోనే ఉన్నారని ఆరోపించారు. కోటికి పైగా ఎకరాలను బ్లాక్ లో పెట్టి 22ఏ పేరుతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ఇప్పటివరకు 200 టీఎంసీలను దోచుకుని పోయాడని ఆరోపించారు.



