
ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ దినోత్సవం ఈనాడు, అమరావతి: కేంద్రంలోని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలతో 1984 ఆగస్టు 16న సీఎం పదవిని కోల్పోయి నెల రోజుల వ్యవధిలో దేశవ్యాప్త ఉద్యమంతో నందమూరి తారక రామారావు తిరిగి అధికారాన్ని దక్కించుకున్నారని వక్తలు గుర్తుచేశారు. ఈ చరిత్రాత్మక ఘటనను పురస్కరించుకొని ఏటా సెప్టెంబర్‌ 16న ప్రజాస్వామ్య పరిరక్షణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎన్టీఆర్‌ లిటరేచర్‌ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి బుధవారం నివాళి అర్పించారు. అప్పట్లో తామంతా ఎన్టీఆర్‌కు అండగా నిలిచిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్‌ను తిరిగి సీఎం స్థానంలో కూర్చోబెట్టడంలో చంద్రబాబు కీలకపాత్ర పోషించారని మాజీ స్పీకర్‌ ప్రతిభాభారతి పేర్కొన్నారు. దళిత సామాజికవర్గానికి చెందిన తనను ఆదరించి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎన్టీఆర్‌ చేశారని మోత్కుపల్లి నరసింహులు తెలిపారు. ఎన్టీఆర్‌ సినీచరిత్ర, భావజాలం, పాలనపై ఇప్పటికే ఏడు పుస్తకాలు వెలువరించామని కమిటీ అధ్యక్షుడు టీడీ జనార్దన్‌ చెప్పారు. కార్యక్రమంలో ఎన్టీఆర్‌ కుమారుడు నందమూరి రామకృష్ణ, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు విక్రమ్‌ పూల, భగీరథ, మధుసూదనరాజు తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




